BJP Telangana: రాహుల్‌కు బిహార్ ఓటమి భయం
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:57 AM
బిహార్‌లో కాంగ్రెస్ ఓడిపోతున్నట్లు తెలిసి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నకిలీ ఓట్లు అంటూ
అందుకే నకిలీ ఓట్లు అంటూ ప్రచారం కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో నకిలీ ఓట్లు లేవా
ఢిల్లీ టూర్లు ఆపి రేవంత్ హైదరాబాద్..వాసుల కష్టాలు చూడాలి: రాంచందర్‌రావు
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లో కాంగ్రెస్ ఓడిపోతున్నట్లు తెలిసి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నకిలీ ఓట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిచిన తెలంగాణ, హిమాచల్, కర్ణాటకలో నకిలీ ఓట్లు గుర్తుకు రాలేదా..? అని నిలదీశారు. రాహుల్ వైఖరి చూస్తుంటే దొంగలు పడిన ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు ఉందని విమర్శించారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. రాహుల్‌గాంధీ ఫేక్(నకిలీ) ఇండియన్ అని, నకిలీ ఇండియన్.. నకిలీ ఓట్ల గురించి మాట్లాడవద్దని అన్నారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎప్పుడూ ఒంటరిగా గెలవలేదని.. అందుకే భాగస్వామ్య పక్షాలతో కలిసి ఎన్నికలకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రేవంత్ ఢిల్లీ టూర్ల బదులు కనీసం కొన్ని రోజులైనా ఇక్కడ ఉండి ప్రజల కష్టాలను చూడాలని కోరారు. మునిసిపల్ శాఖ ఆయన వద్దే ఉందని, రేవంత్ ఢిల్లీ వెళుతుంటే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. బీజేపీకి సున్నా సీట్లు వస్తాయంటూ బీఆర్‌ఎస్ ఎగతాళి చేసేదని, మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకే సున్నా సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. బీజేపీ 36 శాతం ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలుచుకుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సిటింగ్ స్థానాన్ని గెలుచుకుందని గుర్తుచేశారు. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక నెల రోజుల్లో 16 జిల్లాల్లో పర్యటించానని తెలిపారు. ఈ నెల 18 తర్వాత రెండో విడత జిల్లాల పర్యటన ఉంటుందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల దృష్ట్యా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాంచందర్‌రావు అన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎవరి వల్ల రాష్ట్రమొచ్చిందో చర్చకు సిద్ధం: బాలరాజు
ప్రొఫెసర్ జయశంకర్‌ను చూసే తాను టీడీపీ, కాంగ్రె్‌సలను కాదని టీఆర్‌ఎ్‌సలో చేరానని గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో చర్చకు సిద్ధమని ప్రకటించారు. తన అహంకారం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయానంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేశారని.. అలాగైతే, కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. టీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడు దళితుల అంశాలపై మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చేవారని చెప్పారు. తన సతీమణిపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఆపకపోతే తగిన బుద్ధి చెబుతామని బీఆర్‌ఎ్‌సను హెచ్చరించారు. ఎమ్మెల్యేనో, ఎంపీనో కావాలన్న ఆకాంక్ష లేదని బాలరాజు తెలిపారు.