Rahul Gandhi: మోదీని ఆడిస్తున్న పెద్ద వ్యాపారులు
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:38 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే భయపడటమే కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు ఆడించినట్టల్లా ఆడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
అంబానీ, అదానీల చేతిలో రిమోట్ కంట్రోల్
చిన్న వ్యాపారులను నాశనం చేసి బడా వ్యాపారవేత్తలకు మేలు చేయడమే మోదీ లక్ష్యం
దానిలో భాగంగానే జీఎస్టీ, నోట్ల రద్దు
బిహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
చెరువులో దిగి చేపలు పట్టిన ప్రతిపక్ష నేత
18న సీఎంగా ప్రమాణం చేస్తున్నా: తేజస్వి
బెగూసరాయ్/ఖగారియా/ఢిల్లీ, నవంబరు 2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే భయపడటమే కాకుండా పెద్ద వ్యాపారవేత్తలు ఆడించినట్టల్లా ఆడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆదివారం బిహార్‌లోని బెగూసరాయ్, ఖగారియా జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ మాట్లాడుతూ ‘మహాత్మాగాంధీ నాటి శక్తిమంతులైన బ్రిటీష్‌వారిని.
ఎదిరించారు. మరోవైపు 56 అంగుళాల ఛాతీ ఉన్న మన మోదీ ఆపరేషన్ సిందూర్ సమయంలో ట్రంప్ ఫోన్ చేయగానే భయపడిపోయి పాకిస్థాన్‌పై యుద్ధాన్ని ఆపేశారు. అంబానీ, అదానీ రిమోట్ కంట్రోల్ ద్వారా మోదీని ఆడిస్తున్నారు. చిన్న వ్యాపారవేత్తలను నాశనం చేసి, పెద్ద వ్యాపారవేత్తలకు మేలు చేసే లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు తదితర ప్రధాన నిర్ణయాలన్నీ తీసుకుంది’ అని ఆరోపించారు. కాగా, గత 20 ఏళ్లుగా బిహార్ యువత అవకాశాలను, కలలనూ బీజేపీ, జేడీయూ దూరం చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. బిహార్ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైందని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. పారిశ్రామిక రంగంలో ఉపాధి విషయంలో దేశంలోనే 23వ స్థానంలో బిహార్ ఉందని ఖర్గే తెలిపారు. బిహార్‌లోని 10 శాఖల్లో జరిగిన రూ.70 వేల కోట్ల కుంభకోణాలను కాగ్ వెలుగులోకి తెచ్చిందని, దీన్ని అచ్చేదిన్‌కు సంకేతంగా భావించాలా? అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. కాగా, బెగూసరాయ్‌లో ఎన్నికల ప్రచారం అనంతరం రాహుల్‌గాంధీ మత్స్యకారులతో కలిసి పడవలో చెరువు మధ్యలోకి వెళ్లి చేపలు పట్టారు. అనంతరం నీటిలోకి దిగి కూడా భారీ వలతో చేపల వేట కొనసాగించారు. ఈత కూడా కొట్టారు. ఆయన వెంట ఇండియా కూటమి ఉపముఖ్యమంత్రి అభ్యర్థి ముకేశ్ సాహ్నీ కూడా ఉన్నారు.