Share News

‘ఆపరేషన్‌ నార్నియా’!

ABN , Publish Date - Jun 22 , 2025 | 05:58 AM

ఇరాన్‌పై గత వారం ముప్పేట దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. అణు శాస్త్రవేత్తలను మూడేళ్లుగా ట్రాక్‌ చేసిందా? చనిపోయిన 10 మంది ఇరాన్‌ అణు శాస్త్రవేత్తల్లో..

‘ఆపరేషన్‌ నార్నియా’!

  • ఇరాన్‌ అణుశాస్త్రవేత్తలే లక్ష్యంగా 2022లోనే రంగంలోకి మొస్సాద్‌

(సెంట్రల్‌ డెస్క్‌): ఇరాన్‌పై గత వారం ముప్పేట దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. అణు శాస్త్రవేత్తలను మూడేళ్లుగా ట్రాక్‌ చేసిందా? చనిపోయిన 10 మంది ఇరాన్‌ అణు శాస్త్రవేత్తల్లో.. పలువురిపై నేరుగా దాడి చేసిందా? 100 మందితో కూడిన శాస్త్రవేత్తల జాబితాలో.. ఇంకా 90ు మిగిలే ఉన్నారా? వారిని ఏ క్షణమైన అంతమొందించేందుకు ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ కాచుక్కూర్చుందా? ఈ ప్రశ్నలకు ఇరాన్‌ అణుశాస్త్రవేత్తలను హతమార్చేందుకు నియమించిన బృందాలకు నేతృత్వం వహిస్తున్న యోతం(కోడ్‌ నేమ్‌) అవుననే చెబుతున్నారు. 2022లో ప్రారంభమైన తమ ఆపరేషన్‌కు ‘నార్నియా’ అని పేరు పెట్టినట్లు వివరించారు. కోడ్‌ నేమ్‌తోనే ఆయన ఇజ్రాయెల్‌ వార్తాసంస్థ ‘యెదిహోత్‌ అహ్రునోత్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..


ఏ, బీ, సీ, డీ క్యాటగిరీలు

ఇరాన్‌ అణుకార్యక్రమంపై అంతటా ఆందోళన నెలకొంది. 2020లో అమెరికా ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో.. ఇరాన్‌ ప్రయత్నాలను తుంచివేయాలని మొస్సాద్‌కు ఆదేశాలు వచ్చాయి. నేను (యోతం) 2022లో పలు బృందాలను రంగంలోకి దింపాను. అణుశాస్త్రవేత్తల వివరాల సేకరణకు రెండేళ్ల సమయం పట్టింది. అణు కార్యక్రమానికి అవసరమైన న్యూక్లియర్‌, ఫిజిక్స్‌, కెమికల్‌, మెకానికల్‌, రేడియేషన్‌, న్యూట్రానిక్స్‌.. ఇలా వేర్వేరు రంగాల్లోని 100 మంది శాస్త్రవేత్తల చిట్టా సిద్ధమైంది. ఇరాన్‌ అణు కార్యక్రమంలో అత్యంత కీలంగా వ్యవహరించే శాస్త్రవేత్తలను ‘క్యాటగిరీ-ఏ’లో చేర్చాం. వీరి సంఖ్య 10శాతం వరకే ఉంటుంది. మిగతా వారిని ‘బీ, సీ, డీ’ క్యాటగిరీలుగా విభజించాం. ఆ చిట్టాను మా(ఇజ్రాయెల్‌) ప్రభుత్వం ముందు పెట్టాం.


నీడలా వెంటాడుతూ..

ఇజ్రాయెల్‌ ఓ వైపు హమాస్‌.. మరోవైపు హిజ్బుల్లాతో పోరాటం చేస్తూనే.. ఇరాన్‌లోని అణు శాస్త్రవేత్తలను నీడలా వెంటాడింది. నిజానికి మేము గుర్తించిన 100 మంది శాస్త్రవేత్తల్లో చాలా మందికి ఒకరి గురించి మరొకరికి తెలియదు. మేము మాత్రం వారి వివరాలను సేకరిస్తూ.. నిఘాను కొనసాగించాం. ఆ క్రమంలోనే ఇరాన్‌ 60ు యురేనియం శుద్ధిని పూర్తిచేసిందని గుర్తించాం. దాంతో.. న్యూక్లియర్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు ఫ్రెదోన్‌ అబ్బాసీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో నిపుణుడు అక్బర్‌ మతాలిజాదా, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు సయీద్‌ బార్జీలను హిట్‌లిస్టులో టాప్‌-3లో పెట్టాం. వారి తర్వాత భౌతిక శాస్త్ర నిపుణుడు మన్సూర్‌ అస్గరీ ఉన్నారు. గత శుక్రవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగాలంటూ కోడ్‌(శిరచ్ఛేదం) సందేశం వచ్చింది. అంతే.. రెండ్రోజుల వ్యవధిలో 10 మంది అణు శాస్త్రవేత్తలను అంతమొందించాం. నిజానికి క్షిపణి దాడుల్లో చనిపోయింది ఒకరిద్దరే..! మిగతా వారిని వేటాడాం. వారు కారులో వెళ్తుండగా.. ఇంట్లో ఉండగానే మా పనిని పూర్తిచేశాం. మేము అణుశాస్త్రవేత్తలకు కూడా కోడ్‌నేమ్‌ ఇచ్చాము. వారిలో అబ్బాసీ కోడ్‌ ‘డబుల్‌ ఏస్‌(రెండు ఆసులు)’.


10 మందిలో నలుగురు కీలకం

తొలి రెండ్రోజుల్లో పూర్తిచేసిన లక్ష్యాల్లో నలుగురు మాత్రమే ‘క్యాటగిరీ-ఏ’కి చెందిన శాస్త్రవేత్తలు. వారు ఫెద్రోన్‌ అబ్బాసీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ అక్బర్‌ మతాలిజాదా, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు సయీద్‌ బార్జీ, భౌతికశాస్త్ర నిపుణుడు మన్సూర్‌ అస్గరీ ఉన్నారు. మిగతా వారిలో బీ, సీ క్యాటగిరీలకు చెందిన న్యూక్లియర్‌ శాస్త్రవేత్త అహ్మద్‌ రజా దరియానీ, మహమ్మద్‌ మెహ్దీ తెహ్రాన్షీ(ఫిజిక్స్‌), ఫిజిక్స్‌ నిపుణుడు ఆమిర్‌ హసన్‌ ఫఖీ, అబ్దుల్లామిద్‌ మినుష్షర్‌, మన్సూర్‌ అస్గరీ, మెకానికల్‌ నిపుణుడు అలీ బౌఖాయ్‌ ఖత్రిమీ, అబ్బాస్‌ డిప్యూటీ ఫక్రిజాదే ఉన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 05:58 AM