PM Modi: సింహాలతో సయ్యాట!
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:30 AM
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఏర్పాటు చేసిన ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 1.5 లక్షలకు పైగా జంతువులు, పక్షులను సంరక్షిస్తున్నారు. నిపుణుల సంరక్షణలో అరుదైన, అంతరించిపోతున్న జాతులను కాపాడుతున్నారు. ఈ కేంద్రానికి వచ్చిన ప్రధాని మోదీకి.. ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు.

వంతారాలో సరదాగా గడిపిన ప్రధాని మోదీ
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ప్రారంభం
అహ్మదాబాద్, మార్చి 4: వంతారాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఆయన జామ్‌నగర్ జిల్లాలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సందర్శించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఏర్పాటు చేసిన ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 1.5 లక్షలకు పైగా జంతువులు, పక్షులను సంరక్షిస్తున్నారు. నిపుణుల సంరక్షణలో అరుదైన, అంతరించిపోతున్న జాతులను కాపాడుతున్నారు. ఈ కేంద్రానికి వచ్చిన ప్రధాని మోదీకి.. ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు.
వంతారాను ప్రారంభించిన అనంతరం అనంత్ అంబానీతో కలిసి ప్రధాని వంతారా మొత్తం కలియదిరిగారు. ఈ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో సరదాగా గడిపారు. సింహం పిల్లలు, చిరుతపులి పిల్లలకు పాలు పట్టారు. ఏనుగులు, జిరాఫీలకు ఆహారం అందించారు.
జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్ సెంటర్లను, ఐసీయూ వంటి అధునాతన సౌకర్యాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ వైల్డ్‌లైఫ్ హాస్పటల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయించుకుంటున్న ఆసియా సింహాన్ని గమనించారు. ప్రమాదంలో గాయపడిన చిరుతపులికి శస్త్రచికిత్స చేస్తున్న ఆపరేషన్ థియేటర్‌ను సందర్శించారు. ఏనుగులు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడే హైడ్రోథెరపీ పూల్‌ను పరిశీలించారు. జీబ్రాలతో కలిసి నడిచారు. చింపాంజీలతో ఫొటోలు దిగారు. పెద్ద కొండ చిలువలు, రెండు తలల పాములు, రెండు తలల తాబేళ్లు, మొసళ్లు, సీల్స్‌తో సహా ప్రపంచంలోని కొన్ని అరుదైన జాతులను వంతారాలో సంరక్షిస్తున్నారు.
అనంత్ మనసు గొప్పది: మోదీ
పర్యావరణ సుస్థిరతను, వన్యప్రాణుల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూనే జంతువులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తున్న వంతారాను ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతటి దయగల పనిచేస్తున్న అనంత్ అంబానీ, అతని బృందాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. వంతారాలో పనిచేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధాని మోదీ మాట్లాడారు.