Kurnool Bus Accident: బస్సు ప్రమాదం దురదృష్టకరం
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:53 AM
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: పీఎంవో
రూ.5 లక్షల చొప్పున ప్రకటించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 19 మంది సజీవ దహనమవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు కూడా ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఏపీకి చెందిన ఆరుగురికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.2 లక్షలు ప్రకటించింది. అలాగే, తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ఆ రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారాన్ని అందించనున్నట్టు వెల్లడించారు.