Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ దోషే
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:20 AM
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో జేడీఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ
అత్యాచారం కేసులో నేరం రుజువు
తీర్పు వెలువరించిన బెంగళూరు కోర్టు
నేడు శిక్ష ఖరారు
తీర్పు విని కోర్టు హాల్లో ఏడ్చిన ప్రజ్వల్
జేడీఎస్ మాజీ ఎంపీపై నమోదైన నాలుగు అత్యాచార కేసుల్లో ఇదొకటి
బెంగళూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో జేడీఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (34)ను బెంగళూరు కోర్టు దోషిగా తేల్చింది. గత ఏడాది హాసన్ జిల్లాలో ఆయనపై నమోదైన నాలుగు రేప్ కేసుల్లో ఒకదానిలో దోషిగా తేలుస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. న్యాయాధికారి సంతోష్ గజానన్ భట్ శనివారం శిక్ష ఖరారు చేయనున్నారు. జడ్జి తీర్పు వినగానే.. ప్రజ్వల్ రేవణ్ణ కోర్టు హాల్‌లోనే విలపించాడు. తమ కుటుంబానికి చెందిన ఓ ఫాంహౌ్‌సలో ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం చేసి, ఆ దురాగతాన్ని వీడియో తీసినట్లు పేర్కొంటూ నమోదైన కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రజ్వల్ రేవణ్ణ దీంతో సహా నాలుగు రేప్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారీగా వీడియోలు బయటకు రావడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఆయనపై నాలుగు రేప్ కేసులు నమోదయ్యాయి. అప్పుడు హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేసిన రేవణ్ణ ఓడిపోయారు. ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ మనవడు. ప్రజ్వల్ రేవణ్ణపై రేప్ కేసు నమోదైన తర్వాత ఆయన్ను జేడీఎస్ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించింది.
ప్రస్తుత కేసు నేపథ్యమిదీ..
మైసూరు జిల్లా కేఆర్ నగర్‌కు చెందిన 48 ఏళ్ల ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది ఏప్రిల్ 28న ప్రజ్వల్‌పై అత్యాచార కేసు నమోదైంది. హాసన్ జిల్లా హోళెనరసీపురలోని వారి కుటుంబానికి చెందిన ఫాంహౌ్‌సలో పనిచేసే మహిళ.. రేవణ్ణ తనపై 2021లో రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫాంహౌ్‌సలో, బెంగళూరు బసవనగుడిలోని ఆయన తండ్రి రేవణ్ణ నివాసంలో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఆ దురాగతాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడని తెలిపారు. ప్రజ్వల్ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో బాధితురాలిని ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ, తల్లి భవాని కిడ్నాప్ చేశారు. సిట్ పోలీసులు 2024 సెప్టెంబరులో ఆమెను రక్షించారు. అంతకుముందు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు 2024 ఏప్రిల్ 26న బయటకు వచ్చిన తర్వాత ప్రజ్వల్ జర్మనీకి పారిపోయాడు. తిరిగొచ్చిన రేవణ్ణను పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో మే 31 పోలీసులు అరెస్టు చేశారు. హోలేనరసిపుర పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో ముమ్మర దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం 1,632 పేజీలతో గత ఏడాది డిసెంబరులో చార్జిషీట్ దాఖలు చేసింది. 113 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 3న అభియోగాలు మోపింది. ప్రజ్వల్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో 14 నెలలుగా ఉంటున్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి రమ్య ఎక్స్‌లో స్పందించారు.
ఇవి కూడా చదవండి
అనిల్ అంబానీకి షాక్.. లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన ఈడీః
తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ