PM Modi GST Move: మోదీ బ్రహ్మాస్త్రం జీఎస్టీ
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:35 AM
సామాన్యులకు ఊరటనిచ్చేలా జీఎస్టీ రేట్లను సవరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ చేసిన ప్రకటన ప్రధాని మోదీ వేసిన బ్రహ్మాస్త్రమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టిన నిర్ణయం
బిహార్ సహా త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి
రాజకీయ విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సామాన్యులకు ఊరటనిచ్చేలా జీఎస్టీ రేట్లను సవరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ చేసిన ప్రకటన ప్రధాని మోదీ వేసిన బ్రహ్మాస్త్రమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల కేంద్రంతోపాటు రాష్ట్రాలపై అదనపు భా రం పడుతున్నా.. కేంద్రం, ప్రధాని మోదీ రాజకీయంగా లబ్ధి పొందనున్నారని చెబుతున్నారు. దీపావళికి ముందే బిహార్ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతో జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ముందుగానే ప్రకటించారని, దీంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డాయంటున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తొలుత నిర్ణయించాయి. కానీ, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రకటన తర్వాత వెనక్కు తగ్గాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల నేతలు తొలుత విడుదల చేసిన పత్రికా ప్రకటనలను వెనక్కి తీసుకుని సవరించిన ప్రకటనలను విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ మంత్రి భట్టి విక్రమార్కతోపాటు తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నెరసు జీఎస్టీ తగ్గింపును స్వాగతించారు. ఇక, గత బడ్జెట్‌లో ఆదాయ పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత జీఎస్టీ రేట్లపై కోత విధించడం కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన రెండో అతి పెద్ద బహుమతి అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రానున్న బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జీఎస్టీ అంశం బీజేపీకి బాగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.