Share News

PM Modi: పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం

ABN , Publish Date - May 23 , 2025 | 04:49 AM

ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ విజయాన్ని శక్తివంతంగా పేర్కొన్నారు. పాకిస్థాన్‌పై తీవ్ర హెచ్చరికలు చేసి, దేశ అభివృద్ధి పనుల విషయాలు వివరించారు.

PM Modi: పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం

ఇక ప్రతి ఉగ్ర దాడికీ మూల్యం చెల్లించక తప్పదు

నా ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు.. సిందూరం

సిందూరం గన్‌పౌడర్‌గా మారితే ఏమవుతుందో

మన శత్రువులు ప్రత్యక్షంగా చూశారు

రహీంఖాన్‌ ఎయిర్‌బేస్‌ ఇంకా ఐసీయూలోనే..

రాజస్థాన్‌ బికనేర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత తొలి బహిరంగ సభ

బికనేర్‌, మే 22: ‘మన సాయుధ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. త్రివిధ దళాలు ఎలాంటి చక్రవ్యూహం పన్నాయంటే.. వాటి దెబ్బకు పాకిస్థాన్‌ మోకరిల్లింది’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇక ప్రతి ఉగ్రవాద దాడికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తన వంట్లో ప్రవహించేది రక్తం కాదని.. వేడి సిందూరమని స్పష్టం చేశారు. మహిళల సిందూరం గన్‌పౌడర్‌గా మారితే ఏమవుతుందో శత్రువులు కళ్లారా చూశారని అన్నారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత ప్రధాని మొదటిసారి రాజస్థాన్‌ వచ్చారు. బికనేర్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గాంలో ఉగ్రవాదులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి 140 కోట్ల మంది భారతీయుల గుండె గాయపడిందన్నారు. అయితే, మన మహిళల నుదుట బొట్టు చెరిపేసినవారిని మన సైనికులు మట్టిలో కలిపేశారని చెప్పారు. 22 నిమిషాల్లో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారన్నారు. ‘సాధారణంగా నేను ప్రశాంతంగా ఉంటాను. దేశం విషయానికొస్తే మాత్రం తీవ్ర భావావేశంతో, సంకల్పంతో నా రక్తం వేడెక్కుతుంది. మోదీ నరాల్లో రక్తం కాదు.. వేడివేడి సిందూరం ప్రవహిస్తోంది’’ అని మోదీ అన్నారు. ‘‘పాక్‌ ఏనాడూ మనపై ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదు. అందుకే ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుతోంది.

2modi4.jpg

ఇకపై భారత్‌పై ఉగ్రదాడికి దిగితే ఆ దేశం ప్రతి పైసాకూ అడుక్కోవలసి వస్తుంది. భారతీయుల నెత్తుటితో ఆటలాడితే మూల్యం చెల్లించక తప్పదు. ఇది మా దృఢ సంకల్పం. ప్రపంచంలోని ఏ శక్తీ ఈ విషయంలో మనల్ని కదిలించజాలదు. ఆపరేషన్‌ సిందూర్‌.. యావత్‌ భారత ఉగ్రరూపం. ఇదే భారత నూతన రూపం’’ అని తేల్చిచెప్పారు.


అప్పుడు శపథం చేశాను..

2019లో బాలాకోట్‌ దాడుల తర్వాత రాజస్థాన్‌లోనే చురులో తొలి సభ నిర్వహించానని ప్రధాని గుర్తుచేశారు. ‘దేశాన్ని తలవంచనివ్వనని ఈ మట్టిపై శపథం చేశా.. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్‌లోని బికనేర్‌ వీరభూమి నుంచి చెబుతున్నాను.. ిభారతీయుల నెత్తురు కళ్లచూసిన వాళ్లు ప్రతి రక్తపు బొట్టుకూ మూల్యం చెల్లించారు. భారత్‌ నోరుమూసుకుని కూర్చుంటుందని అనుకున్నవాళ్లు ఇప్పుడు తమ ఇళ్లలో దాక్కున్నారు. తమ ఆయుధాలు చూసి గర్వించినవాళ్లు.. వారి శిథిలాల కిందే సమాధి అయ్యారు. అయితే పహల్గాంలో ఉగ్రదాడికి ఇది ప్రతీకారం కాదు.. కొత్త తరహా న్యాయం. పాక్‌తో ఇక వాణిజ్యం గానీ, చర్చలు గానీ ఉండవు. పాక్‌ ఆక్రమిత కశ్మీరుపైనే చర్చిస్తాం. అణు బెదిరింపులకు భయపడేది లేదు’ అని స్పష్టం చేశారు.

వసతుల కల్పనకు పెద్దపీట

అభివృద్ధి చెందిన భారత్‌లో అధునాతన మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున కృషిసాగుతోందని ప్రధాని అన్నారు. గత 11 ఏళ్లలో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల ఆధునికీకరణకు అసాధారణంగా పనిచేశామని చెప్పారు. గతంలో కంటే ఎన్నో ఎక్కువ రెట్ల సొమ్మును అభివృద్ధి ప్రాజెక్టులపై ఖర్చుచేస్తున్నామని తెలిపారు. రూ.1,100 కోట్లతో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో నవీకరించిన 103 అమృత్‌ రైల్వే స్టేషన్లను బికనీర్‌ సభ నుంచి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. 1,300కిపైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఈ సందర్భంగా మోదీ తెలిపారు. వందేభారత్‌ రైలు దాదాపు 70 మార్గాల్లో నడుస్తోందని చెప్పారు. గత 11 ఏళ్లలో వందల కొద్దీ రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ బ్రిడ్జిలను నిర్మించామన్నారు. మొట్టమొదటి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పని విస్తృతంగా సాగుతోందని చెప్పారు. మౌలిక వసతులపై ఖర్చుచేసే డబ్బుతో ఉపాధి, వ్యాపార అవకాశాలు కూడా సృష్టిస్తున్నామన్నారు.


అన్నీ సినిమా డైలాగులే: కాంగ్రెస్‌

రాజస్థాన్‌లో ప్రధాని వ్యాఖ్యలు గొప్పగా ఉన్నాయని.. కానీ అవన్నీ సినిమా డైలాగులేనని కాంగ్రెస్‌ ఎద్దేవాచేసింది. తన వల్లే భారత్‌-పాక్‌ యుద్ధం ముగిసిందన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై మోదీ ఎందుకు నోరెత్తరని ప్రశ్నించింది. ‘ప్రధాని తక్షణమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టాలి. కాల్పుల విరమణపై ట్రంప్‌ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలి’ అని జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. పహల్గాంలో దాడిచేసిన క్రూరహంతకులు ఇంకా స్వేచ్ఛగా ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:58 AM