PM Modi: ఏమార్చి... విరుచుకుపడి..
ABN , Publish Date - May 08 , 2025 | 05:10 AM
శత్రువును ఏమార్చి కోలుకోలేని విధంగా దెబ్బ తీయడంలో ప్రధాని నరేంద్ర మోదీ స్టైలే వేరు. ఆయన వ్యూహాలను పసిగట్టడంలో దారుణంగా విఫలమైన పాకిస్థాన్‌కు ప్రతిసారీ భారత్ చేతిలో శృంగభంగం తప్పడం లేదు.
బాలాకోట్ నుంచి ఆపరేషన్ సిందూర్ వరకూ...
దాయాది దృష్టి మరల్చి చావుదెబ్బ కొట్టిన భారత్
న్యూఢిల్లీ, మే 7: శత్రువును ఏమార్చి కోలుకోలేని విధంగా దెబ్బ తీయడంలో ప్రధాని నరేంద్ర మోదీ స్టైలే వేరు. ఆయన వ్యూహాలను పసిగట్టడంలో దారుణంగా విఫలమైన పాకిస్థాన్‌కు ప్రతిసారీ భారత్ చేతిలో శృంగభంగం తప్పడం లేదు. 2019లో బాలాకోట్ దాడులతో పాటు తాజాగా ఆపరేషన్ సిందూర్ విషయలోనూ ఈ విషయం నిరూపితమైంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్ దాడికి దిగింది. దీనికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎంతో ప్రశాంతంగా కనిపించారు. 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను జాతికి అంకితం చేశారు. ఆ సమయంలో భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన ప్రసంగించారు. 26 రాత్రి 9 గంటలకు వాయుసేన దాడులకు సిద్ధమవుతున్న సమయంలో కూడా ఢిల్లీలో మీడియా సదస్సులో మోదీ ప్రసంగించారు. ఆ సమయంలోనూ ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చివరకు మన బలగాలు విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించాయి.
ఆపరేషన్ సిందూర్ వేళా అదే తీరు
ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు కూడా ప్రధాని ప్రశాంతంగా ఉన్నారు. అప్పటిలాగానే దాడులకు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 2047 నాటికి ఆర్థిక దిగ్గజంగా ఎదగాలన్న దేశ ఆకాంక్షల గురించి మాట్లాడారు. ఆయన ముఖంలో ఎక్కడా ఒత్తిడి, ఆందోళన ఛాయామాత్రంగా కూడా కనిపించలేదు. పైగా నవ్వుతూ, జోకులు వేస్తూ మాట్లాడారు. ఇంకోవైపు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ ప్రకటించడం ద్వారా దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పర్యవనానాలకు సన్నద్ధం చేస్తున్నారని ప్రత్యర్థి దేశంతో సహా అందరూ భావించారు. అయితే ఇదంతా తమను ఏమార్చడానికి పన్నిన వ్యూహం అని పాక్‌కు అర్థమయ్యే సరికి మన బలగాలు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశాయి. బాలాకోట్ దాడికి ముందు మోదీ ప్రవర్తనను విశ్లేషించి ఉంటే.. పాకిస్థాన్‌కు ఈ దుస్థితి వచ్చేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.