Prime Minister Modi: సింధూ పై పట్టు మనకే
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:53 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో పాక్ కారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తిన సందర్భంగా చేసిన ‘‘ఒకే సమయంలో, ఒకే చోట నెత్తురు, నీళ్లు ప్రవహించవు’’ అనే వ్యాఖ్యలు ఇప్పుడు సింధూ జలాల ఒప్పందం రద్దు ద్వారా నిజం అయ్యాయి. 1960లో ప్రపంచ బ్యాంక్ చొరవతో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, పాక్‌కి అత్యధిక జలాలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు భారత్ ఒప్పందాన్ని రద్దు చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23 : ‘‘ఒకే సమయంలో, ఒకేచోట నెత్తురు, నీళ్లు ప్రవహించవు’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సింధూ జలాల ఒప్పందాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాక్ కారణంగా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని 2016లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని రద్దుచేసుకుని ఆ మాటలను ఆయన నిజం చేసి చూపించారు. సింధూనది నుంచి నీటి పంపిణీకి సంబంధించి భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం నుంచి అధిక లబ్ధి పొందుతున్న దేశం పాకిస్థాన్. నదీ ప్రవాహానికి దిగువన ఉన్నా, సింధూ జలాల్లో 80శాతం ఆ దేశమే వాడుకుంటోంది. పాక్ దుశ్చర్యలతో సరిహద్దుల్లో ఎన్ని ఉద్రిక్తతలు తలెత్తినా...దాదాపు ఆరు దశాబ్దాలుగా నిరాటంకంగా ఈ ఒప్పందం కొనసాగడానికి భారత్ సహకరిస్తోంది. నీటి ప్రవాహానికి ఎగువన ఉన్నా, ఏ దశలోనూ పాక్‌కు వెళ్లే జలాల ప్రవాహాలను అడ్డుకోలేదు. ఈ విషయంలో ప్రపంచంలోనే శాంతియుత పంపకాలు జరిగిన అతి పెద్ద ఒడంబడిక ఇది.
పంపకాలు ఇలా..: ప్రపంచ బ్యాంక్ చొరవతో 1960లో సింధూజలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, సింధూ పరీవాహకం పరిధిలోని ఆరు నదులను ఇరుదేశాల మధ్య విభజించారు. సింధు, జీలం, చీనాబ్ నదులపై (పడమట) పాక్‌కు, బియాస్, రావి, సట్లెజ్ నదులపై (తూర్పు) భారత్‌కు హక్కును కల్పించారు. పంపకాల తీరు చూస్తే, సింధూజలాలు అత్యధికంగా పాక్‌లోనే ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా భారత్ తాగు,సాగు అవసరాలకు తూర్పు వైపు ప్రవహించే నదులపైనే ఆధారపడుతుంది. పడమట వైపు ప్రవహించేనదుల నీటితో పెద్దగా మనకు పని ఉండదు. అందువల్ల సింధూజలాలు అత్యధికంగా పాక్‌కు దక్కుతున్నాయి. అదేసమయంలో భారత్ నదీ ప్రవాహానికి ఎగువన ఉంది. భౌగోళితంగా వ్యూహాత్మక అనుకూలత ఇది. కోరుకుంటే, పాకిస్థాన్‌కు జలాల ప్రవాహాన్ని అడ్డుకోగలదు. ప్రపంచ బ్యాంక్ చొరవతో తొమ్మిదేళ్లపాటు చర్చలు జరిగి, చివరకు 1960లో ఇరుదేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం ఖరారైంది.
విశిష్టతలు...
రెండు దేశాల మధ్య శాంతియుత నీటి పంపకాలకు వాహికగా నిలిచిన ఈ ఒప్పందానికి అనేక విశిష్ఠతలు ఉన్నాయి. అవి..
సరిహద్దుల్లో జలాల పంపిణీకి కుదుర్చుకున్న ఆసియాలోని ఏకైక ఒప్పందమిది.
1965, 1971ల్లో రెండు యుద్ధాలు జరిగాయి. కానీ, సింధూ జలాల కమిషన్ జల వివాదాల పరిష్కారానికి ఆ సమయంలోనూ పనిచేసింది.
భారత పార్లమెంటుపై 2001లో ఉగ్రదాడి జరిగింది. 2019లో పుల్వామాలో మన జవాన్లను పాక్ ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. అయినా, ఒప్పందం నుంచి భారత్ బయటకు రాలేదు. కనీసం ఒప్పందాన్ని సమీక్షించాలంటూ అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షించే వియన్నా కన్వెన్షన్‌ను ఆశ్రయించలేదు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..