PM Modi: నూనె వాడకం తగ్గించండి
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:44 AM
ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం 119వ సంచికలో ఆయన ప్రసంగించారు.

ఊబకాయం నివారణకు అదే చిట్కా.. మన్ కీ బాత్‌లో ప్రధాని
‘ఊబకాయం’పై సందేశాలు పంపిన నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్‌కు ప్రశంస
న్యూఢిల్లీ, ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 23: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఊబకాయం సమస్య నివారణకు ప్రధాని మోదీ ఓ చిట్కా చెప్పారు. ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం 119వ సంచికలో ఆయన ప్రసంగించారు. ఊబకాయంపై క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పంపిన సందేశాలను వినిపించి వారిని అభినందించారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన సోషల్ మీడియా ఖాతాల బాధ్యతను దేశంలోని స్ఫూర్తిదాయక మహిళలకు అప్పగిస్తానని ప్రకటించారు. ఊబకాయంపై ప్రధాని మాట్లాడుతూ.. ‘‘పది శాతం నూనె వాడకం తగ్గించండి. ఆ విషయం పది మందికి చెప్పండి. ఆ పది మంది ఇంకో పది మందికి సవాల్ విసరాలి. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మాదిరిగా ఆరోగ్య సంరక్షణకు ఆహార నియమావళిని పాటించాలి.
ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి’’ అని అన్నారు. ఊబకాయం ఆందోళనకరమైన సమస్య అని, నూనె వాడకాన్ని తగ్గించాలని నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ తమ సందేశాల్లో పిలుపునిచ్చారు. మరోవైపు, విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం ఇస్తూ.. ‘‘జాతీయ సైన్స్ దినోత్సవం (28వ తేదీ) సందర్భంగా ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు పరిశోధనా లేబొరేటరీలు, ప్లానిటోరియాలను, అంతరిక్ష కేంద్రాలను సందర్శించి.. ఒకరోజు శాస్త్రవేత్తగా గడపాలి. పుస్తక పరిజ్ఞానానికి అతీతంగా ప్రాక్టికల్ పరిజ్ఞానం పెంచుకోవాలి’’ అని అన్నారు.
జ్యోతి యర్రాజీ వంటి క్రీడాకారులతో కొత్త ఆశలు
దేశం ప్రపంచ క్రీడాశక్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీతోపాటు సావన్ బార్వాల్(హిమాచల్ ప్రదేశ్), కిరణ్ మాత్రే, తేజస్ షిర్సే(మహారాష్ట్ర) తదితరులు దేశానికి కొత్త ఆశలు తొడిగారని కొనియాడారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో దేశం నలుమూలల నుంచి 11 వేలమంది అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
తొడసం కైలాస్ శభాష్
తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ గిరిజన భాష పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ‘కొలామి’ భాషలో గీతానికి స్వరరచన చేసేందుకు ఆయన ఏఐని వినియోగించారని ప్రశంసించారు. ఈయన మహాభారత్ పుస్తకాన్ని 3నెలల్లో గోండు భాషలోకి అనువదించారు. రామకృష్ణ మఠం 5సంపుటాల్లో వెలువరించిన బాలల మహా భారతాన్నీ అనువదించారు. ఆ భాషలో యూట్యూబ్ చానెల్ కూడా నడుపుతున్నారు.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.