Share News

PM Modi Warn: చొరబాటుదారులతో జాగ్రత్త

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:20 AM

వైవిధ్యం, సమైక్యత...భారతదేశ బలాలని, వాటికి చొరబాటుదారులు ముప్పుగా మారారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తే దేశం బలహీనపడుతుందని ఆందోళన...

PM Modi Warn: చొరబాటుదారులతో జాగ్రత్త

  • ‘జనాభా’ను మార్చేయడమే వారి లక్ష్యం

  • ఆర్‌ఎ్‌సఎస్‌ శతాబ్ది వేడుకల్లో ప్రధాని వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, అక్టోబరు 1 : వైవిధ్యం, సమైక్యత...భారతదేశ బలాలని, వాటికి చొరబాటుదారులు ముప్పుగా మారారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తే దేశం బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీఆర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) శతాబ్ది వేడుకల్లో బుధవారం మోదీ పాల్గొనారు. ‘‘జనాభాలో గణనీయమైన మార్పు కోసం చొరబాటుదారులు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సామాజిక సామరస్యం దెబ్బతిని, అంతర్గత భద్రత ప్రమాదంలో పడుతుంది’’ అని మోదీ తెలిపారు. చొరబాటుదారులు ఈ దేశ యువత ఉపాధిని లాగేసుకోకుండా చూడటం, సోదరీమణులు, కుమార్తెలను వారినుంచి రక్షించుకోవడాన్ని ఈ మిషన్‌ లక్ష్యంగా ఆయన నిర్దేశించారు. జాతి నిర్మాణంలో ఆర్‌ఎ్‌సఎస్‌ గొప్ప భూమికను పోషించిందని మోదీ అన్నారు. సంస్థ తన చరిత్రలో పలు దాడులకు గురయినప్పటికీ, దేశానికి ఎన్నడూ అపకారం తలపెట్టలేదని తెలిపారు. దేశమే ప్రథమం అనే భావనతో ఆర్‌ఎ్‌సఎస్‌ పని చేస్తోందని, పేదల జీవితాలను మార్చేందుకు కృషిచేసిందని కొనియాడారు. ‘‘దేశ ప్రజల్లో సామరస్య భావనను వ్యాప్తిచేయడం లక్ష్యంగా దేశమంతా ఆర్‌ఎ్‌సఎస్‌ విస్తరించి పనిచేస్తోంది. సమాజంలోని కుల,మత, జాతి బేధాలను నిర్మూలించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్యక్రమాలను చేపడుతోంది. సమ్మిళిత సమాజ సాధన ఈ సంస్థ ఆశయం’’ అని మోదీ వివరించారు. దేశం పట్ల అపార ప్రేమను కలిగిన ఆర్‌ఎ్‌సఎస్‌ బ్రిటిషన్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిందని తెలిపారు. ‘‘జాతీయోద్యమ కార్యకర్తలకు సంఘ్‌ వలంటీర్లు ఆశ్రయమిచ్చారు. స్వయంగా ఆ సంస్థ నాయకులు కూడా జైలుపాలయ్యారు. సంస్థ స్ఫూర్తిని అణచివేయడానికి పలు ప్రయత్నాలు జరిగాయి. అబాంఢాలు వేస్తూ తప్పుడు కేసులు నమోదయ్యాయి. అయినా, ఆర్‌ఎ్‌సఎస్‌ ఈ దేశానికి అపకారం తలపెట్టలేదు. మంచి, చెడు.. రెండూ ఉండే సమాజంలో తననుతాను భాగం చేసుకుని పనిచేస్తోంది’’ అని మోదీ వివరించారు. ‘ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మాధవ్‌ గోల్వాల్కర్‌పై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ప్రశాంత చిత్తంతో ఒక మాట అన్నారు. ‘కొన్నిసార్లు మన నాలుక పంటి కింద పడి బాధిస్తుంది. అందుకని పళ్లను మనం పీకేసుకోం’ అని సెలవిచ్చారు’’ అని తెలిపారు. ఎమర్జెన్సీ రోజులను మోదీ గుర్తుచేసుకుంటూ.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఉన్న తిరుగులేని విశ్వాసమే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్‌ఎ్‌సఎ్‌సను పోరాడేలా చేసిందని తెలిపారు. కాగా, సంఘ్‌ శతాబ్ది వేడుకల సందర్భంగా రూ.వంద నాణెం, స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. నాణెం ఒకవైపు జాతీయచిహ్నం, రెండో వైపు భరతమాత చిత్రం ఉన్నాయి. నాణెంపై భరతమాత చిత్రం ముద్రించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని మోదీ తెలిపారు.


'పంద్రాగస్టు’ ప్రసంగాన్ని గుర్తు తెస్తూ

ప్రధాని వ్యాఖ్యలు ‘ఆగస్టు 15’ ప్రసంగాన్ని గుర్తుకు తెచ్చాయి. ఈ సందర్భంగా ‘డెమోగ్రాఫికల్‌ మిషన్‌’ను ప్రకటించారు. ఇప్పుడు ఆర్‌ఎ్‌సఎస్‌ వేదికపైనా అదే చెప్పారు. బెంగాల్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతాబెనర్జీ ఓటు రాజకీయాలు చేస్తున్నారని అప్పట్లో మోదీ దుయ్యబట్టారు. ఇందులోభాగంగానే ముస్లిం ప్రాబల్యం కలిగిన బంగ్లాదేశ్‌కు చెందిన చొరబాటుదారులను బలపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలను ఆనాడు అంతే దీటుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. సరిహద్దు భద్రత కేంద్ర పరిధిపలోని అంశమని, అందులో ఉత్పన్నమయ్యే సమస్యలను కేంద్రమే పరిష్కరించాల్సి ఉంటుందని ఆనాడు మమతాబెనర్జీ స్పష్టం చేశారు.

Updated Date - Oct 02 , 2025 | 03:20 AM