Share News

PM Modi: ప్రపంచం దృష్టంతా ఆ ముగ్గురు దేశాధినేతల మీదే!

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:22 AM

ప్రధాని మోదీ ఏడేళ్ల విరామం తర్వాత చైనా గడ్డపై కాలు పెట్టారు. జపాన్‌ పర్యటనను ముగించుకొని ఆయన శనివారం సాయంత్రం తియాన్‌జిన్‌కు చేరుకున్నారు.

PM Modi: ప్రపంచం దృష్టంతా  ఆ ముగ్గురు దేశాధినేతల మీదే!

  • ఎస్‌సీవో సదస్సు కోసం చైనాకు చేరుకున్న ప్రధాని మోదీ

  • నేడు జిన్‌పింగ్‌తో ప్రత్యేక భేటీ

  • రేపు మోదీతో పుతిన్‌ సమావేశం

తియాంజిన్‌, ఆగస్టు 30: ప్రధాని మోదీ ఏడేళ్ల విరామం తర్వాత చైనా గడ్డపై కాలు పెట్టారు. జపాన్‌ పర్యటనను ముగించుకొని ఆయన శనివారం సాయంత్రం తియాన్‌జిన్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో) సదస్సులో పాల్గొంటారు. అమెరికాతో తీవ్రమైన వాణిజ్యపరమైన ఉద్రిక్తతల వేళ మోదీ చైనాలో పర్యటించడం, జిన్‌పింగ్‌తో సమావేశం కానుండటంతో పాటు వాణిజ్య ఉద్రిక్తతలకు కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇదే సమయంలో చైనాలో పర్యటిస్తుండటం, మోదీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా ఈ ముగ్గురు నేతలపైనే ఉంది. జపాన్‌ పర్యటన సమయంలో ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో.. ‘‘ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కోసం చైనా, ఇండియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని నొక్కి చెప్పారు. మరోవైపు, పుతిన్‌ చైనాను ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన దేశం’గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు దేశాధినేతలు తమ భేటీల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారు. జిన్‌పింగ్‌, మోదీ ఆదివారం భేటీ అవుతారు. పుతిన్‌, మోదీ సమావేశం సోమవారం ఉంటుందని రష్యా అధ్యక్ష కార్యాలయం ఇదివరకే ప్రకటించింది. మోదీ చివరిసారిగా 2018 జూన్‌లో చైనాలో పర్యటించారు. అప్పుడు ఎస్సీవో సదస్సులో పాల్గొన్నారు. 2019అక్టోబరులో జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటించారు. మరుసటి ఏడాది గల్వాన్‌ ఘర్షణతో రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే, ట్రంప్‌ టారిఫ్‌ యుద్ధం మొదలు పెట్టిన తర్వాత, రెండు దేశాలు మళ్లీ వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. కాగా, ఎస్సీవో సదస్సు ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరగనుంది.


ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ ఫోన్‌

ప్రధాని మోదీకి ఉక్రెయిన్‌ అఽధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం ఫోన్‌ చేశారు. యుద్ధం ముగింపునకు రష్యా అధినాయకత్వంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ట్రంప్‌తో ఇటీవల జరిగిన చర్చల వివరాలను తెలిపారు. అయితే తక్షణమే కాల్పుల విరమణ జరగాలని పేర్కొన్నారు. శాంతిని నెలకొల్పేందుకు చేసే అన్ని రకాల ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఇస్తుందని మోదీ జెలెన్‌స్కీకి ఈ సందర్భంగా తెలిపారు. మోదీ చైనా పర్యటన వేళ ఇండియాలో ఉన్న ఆ దేశ రాయబార కార్యాలయం ఎక్స్‌లో వినాయకుడి ఫొటోను షేర్‌ చేసింది. ఈ విగ్రహం చైనాలో క్రీ.శ 618-907 మధ్య పాలించిన టాంగ్‌ వంశం కాలం నాటిది కావడం విశేషం. చైనా, భారత్‌ల మధ్య 11వందల ఏళ్ల నాటి నుంచే కళలు, విశ్వాసాలు, సంస్కృతుల కలయిక ఉందని చెప్పడానికి ఈ వినాయకుడి విగ్రహమే గుర్తు అని ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్‌ అన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 05:22 AM