PM Modi: ఏడాదికి 50 రాకెట్లు ప్రయోగించగలమా?
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:19 AM
అంతరిక్ష రంగంలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు రంగం ముందుకొచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు.
అంతరిక్ష శాస్త్రవేత్తలను ప్రశ్నించిన ప్రధాని మోదీ
ప్రైవేటు రంగం ముందుకొచ్చి సహకరించాలని పిలుపు
న్యూఢిల్లీ, ఆగస్టు 23: అంతరిక్ష రంగంలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు రంగం ముందుకొచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ఏటా 5 నుంచి 6 ప్రధాన రాకెట్లను ప్రయోగిస్తున్నామని.. ప్రతి ఏడాది 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి మనం చేరుకోగలమా..? అంటూ అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను ప్రశ్నించారు. శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడారు.
భవిష్యత్తులో చేపట్టే మిషన్ల కోసం భారత్ వ్యోమగాముల సమూహాన్ని ఏర్పాటు చేయబోతోందని.. ఇందులో యువత కూడా పాలుపంచుకోవాలని కోరారు. ‘మనం చంద్రుడు, అంగారక గ్రహాన్ని ఇప్పటికే చేరుకున్నాం. ఇప్పుడు ఇంకా లోతైన అంతరిక్షంలోకి తొంగి చూడాలి. త్వరలోనే గగన్‌యాన్ మిషన్‌ను ప్రారంభించబోతున్నాం. అలాగే సొంత స్పేస్‌స్టేషన్‌ను కూడా నిర్మించుకోబోతున్నాం’ అని చెప్పారు.