PM Modi Support Radha Krishnaan: రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొందాం
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:32 AM
ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విపక్షాలను ప్రధాని మోదీ కోరారు. ప్రజాసేవలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొందామని ..
విపక్షాలకు విజ్ఞప్తి చేసిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఉపరాష్ట్రపతి పదవికి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విపక్షాలను ప్రధాని మోదీ కోరారు. ప్రజాసేవలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొందామని విజ్ఞప్తిచేశారు. ఎన్డీయే కూటమి ఎంపీలతో మంగళవారం ప్రధాని సమావేశమయ్యారు. రాధాకృష్ణన్‌ను ఎంపీలకు పరిచయం చేశారు. ఈ భేటీ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. సింధూ జలాల విషయంలో తొలిప్రధాని నెహ్రూ వ్యవహరించిన తీరును ఈ సమావేశంలో మోదీ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. నెహ్రూ దేశాన్ని రెండుసార్లు విభజించారని విమర్శించారు. పార్లమెంటు ఆమోదం లేకుండానే పాక్‌తో సింధూజలాల ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆయన సంతకాలు చేశారని విమర్శించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం దేశ ప్రయోజనాలను నెహ్రూ తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ ఒప్పందం కారణంగా సింధూజలాల్లో 80 శాతం హక్కు పాకిస్థాన్‌కు పోయిందన్నారు. అందువల్ల ఇది రైతు వ్యతిరేక ఒప్పందమని, విలువైన జలాలు మన రైతులకు అందకుండాపోయాయని ఆయన తెలిపారు.