Share News

PM Modi: స్వదేశీ ఉత్పత్తులే ముద్దు!

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:21 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై అధిక సుంకాలు విధించిన వేళ.. దేశ ప్రజలంతా ఇక స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు.

PM Modi: స్వదేశీ ఉత్పత్తులే ముద్దు!

  • ట్రంప్‌ సుంకాల వేళ మోదీ పిలుపు.. ఆత్మనిర్భరతతో అగ్రదేశంగా మారదాం!

  • బహుమతులు, వస్త్రాలు, అలంకార సామగ్రి.. దేశీయ వస్తువులనే వాడండి

  • ప్రధానంగా పండుగల్లో ఇవే వినియోగించండి.. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని

న్యూఢిల్లీ, ఆగస్టు 31: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై అధిక సుంకాలు విధించిన వేళ.. దేశ ప్రజలంతా ఇక స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. వచ్చేదంతా పండుగల కాలమని.. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారుచేసిన వస్తువులనే ఉపయోగించాలని కోరారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదం, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దేశాభివృద్ధికి తోడ్పడతాయని నొక్కిచెప్పారు. ‘జీవితంలో అవసరమైన ప్రతి వస్తువూ స్వదేశీ తయారీవే అయిఉండాలి. ఇప్పటికే పలు ప్రాంతాలు గణేశ్‌ చతుర్థి వేడుకలు జరుపుకొంటున్నాయి. ఇంకొన్నాళ్లలో దసరా, దీపావళి వస్తున్నాయి. బహుమతులు, వస్త్రాలు, అలంకార సామగ్రి.. ఇలా ఏవైనా భారతీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయండి. ఇవి స్వదేశీ వస్తువులని సగర్వంగా చెప్పండి’ అని సూచించారు. కాగా, ఈ వర్షాకాలంలో ప్రకృతి విపత్తులు విలయం సృష్టించాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇవి దేశానికి పరీక్ష పెడుతున్నాయన్నారు. ప్రకృతి విపత్తులతో విలవిలలాడిన జమ్మూకశ్మీరులోనే రెండు కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. పుల్వామాలో మొట్టమొదటి డే అండ్‌ నైట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగిందని.. శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్‌ సరస్సులో ‘ఖేలో ఇండియా జల క్రీడల పండుగ’ జరిగిందని గుర్తుచేశారు. విషాద ఘటనల కారణంగా వీటిని చాలా మంది గమనించలేదన్నారు. పుల్వామాలో క్రికెట్‌ జరగడం గతంలో అసాధ్యమని.. కానీ ఇప్పుడు దేశం పరివర్తన చెందుతోందని తెలిపారు. హైదరాబాద్‌ విముక్తి ఆపరేషన్‌కు సంబంధించి సర్దార్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యల ఆడియోను మోదీ వినిపించారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్‌లో నిజాం, రజాకార్ల దురాగతాలు కొనసాగాయని తెలిపారు. సెప్టెంబరులో హైదరాబాద్‌ విమోచన దినం జరుపుకోనున్నామని.. ‘ఆపరేషన్‌ పోలో’లో పాలుపంచుకున్న కథానాయకుల ధైర్యసాహసాలను గుర్తుచేసుకుందామని చెప్పారు.

Updated Date - Sep 01 , 2025 | 05:21 AM