Share News

Japan visit: జపాన్‌ బుల్లెట్‌ రైలులో మోదీ

ABN , Publish Date - Aug 31 , 2025 | 05:24 AM

జపాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బుల్లెట్‌ రైలులో ప్రయాణించారు. సెండాయ్‌ నగరానికి టోక్యో నుంచి జపాన్‌ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బయలు వెళ్లారు.

Japan visit: జపాన్‌ బుల్లెట్‌ రైలులో మోదీ

  • టోక్యో నుంచి సెండాయ్‌ వరకు జపాన్‌ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి ప్రయాణం

  • షిగేరు దంపతులకు మోదీ కానుకలు

  • ఆంధ్రప్రదేశ్‌లో అరుదుగా దొరికే చంద్రకాంత రాయితో చేసిన బౌల్స్‌ బహుమతి

టోక్యో, ఆగస్టు 30: జపాన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బుల్లెట్‌ రైలులో ప్రయాణించారు. సెండాయ్‌ నగరానికి టోక్యో నుంచి జపాన్‌ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బయలు వెళ్లారు. అంతకు ముందు ఆయన తూర్పు జపాన్‌ రైల్వే కంపెనీ(జేఆర్‌ ఈస్ట్‌)లో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లతో ముచ్చటించారు. కొత్తగా రూపొందించిన ఆల్ఫా-ఎక్స్‌ రైలును ఇరువురు ప్రధానులు పరిశీలించారు. అందుకు సంబంధించిన చిత్రాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. బుల్లెట్‌ రైలు ప్రయాణానికి ముందు మోదీ 16 మంది జపాన్‌ గవర్నర్లతో భేటీ అయ్యారు.


మరోవైపు, జపాన్‌ పర్యటన సందర్భంగా మోదీ.. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో, ఆయన సతీమణికి ప్రత్యేక కానుకలు-- రామెన్‌ బౌల్స్‌, వెండి చాప్‌స్టిక్స్‌, కశ్మీరీ శాలువాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అరుదుగా లభించే చంద్రకాంత రాయితో రామెన్‌ బౌల్స్‌ను తయారు చేస్తారు. చంద్రకాంత రాయిని ప్రేమ, రక్షణ, సమతౌల్యానికి ప్రతీకగా భావిస్తారు. రామెన్‌ బౌల్‌ అడుగు భాగాన్ని రాజస్థాన్‌ పార్చిన్‌కారి శైలిలో.. అరుదైన రాళ్లతో పొదిగిన మక్రానా పాలరాతితో తయారు చేసినట్లు సమాచారం. దీంతోపాటు.. షిగేరు ఇషిబా సతీమణికి జమ్మూకశ్మీర్‌ హస్తకళల విశిష్టతను చాటేలా పశ్మీనా శాలువాను బహూకరించారు.

Updated Date - Aug 31 , 2025 | 05:24 AM