Share News

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి వారింకా తేరుకోలేదు

ABN , Publish Date - Nov 03 , 2025 | 04:54 AM

పాకిస్థాన్‌లో పేలుళ్లు సంభవిస్తే కాంగ్రెస్‌ ‘రాచకుటుంబా’నికి నిద్ర దూరమైందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌ నుంచి  వారింకా తేరుకోలేదు

  • పాక్‌పై బాంబులేస్తే..కాంగ్రెస్‌

  • రాచకుటుంబానికి నిద్ర లేదు: మోదీ

  • పట్నాలో భారీ రోడ్‌షో

  • పాక్‌పై బాంబులు వేస్తే కాంగ్రెస్‌ రాచకుటుంబానికి నిద్ర లేదు

  • బిహార్‌ మహాగఠ్‌బంధన్‌లో తీవ్ర విభేదాలు

  • వారి మేనిఫెస్టో అబద్ధాల పుట్ట: ప్రధాని

అర్రా/పట్నా, నవంబరు 2: పాకిస్థాన్‌లో పేలుళ్లు సంభవిస్తే కాంగ్రెస్‌ ‘రాచకుటుంబా’నికి నిద్ర దూరమైందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నుంచి పాక్‌తోపాటు కాంగ్రె్‌సలోని పేరుగొప్ప నాయకులు ఇంకా తేరుకోలేదని ఎద్దేవా చేశారు. బిహార్లో ఇండీ కూటమి పార్టీలతో కూడిన మహాగఠ్‌బంధన్‌లో తీవ్ర విభేదాలు ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన అర్రాలో జరిగిన సభలో మాట్లాడారు. పట్నాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ.. వికసిత్‌ భారత్‌ కోసం ఎన్‌డీఏ పార్టీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తుంటే.. కాంగ్రెస్‌, ఆర్‌జేడీ మాత్రం పరస్పరం కొట్లాడుకుంటున్నాయని అన్నారు. ‘ఓ అంతర్గత సమాచారం చెబుతున్నాను. నామినేషన్ల దాఖలుకు ముందు రోజు ఈ పార్టీలు నాలుగ్గోడల మధ్య సమావేశమయ్యాయి. ఆర్‌జేడీ నుంచి సీఎం అభ్యర్థి ఉండడం కాంగ్రె్‌సకు ఇష్టం లేదు. దీంతో ఆ పార్టీ కాంగ్రెస్‌ తలపై తుపాకీ పెట్టి.. తేజస్వి యాదవే సీఎం అభ్యర్థి అని బలవంతంగా ప్రకటించేలా చేసింది. ఎన్నికల ముందే తీవ్ర విభేదాలు తలెత్తాయంటే.. ఎన్నికల తర్వాత తలలు పగలగొట్టుకుంటారు’ అని విరుచుకుపడ్డారు. ఆర్‌జేడీ హయాంలో బీజేపీలో ‘కట్టా (తుపాకీ), క్రూరత, కటుతా (కాఠిన్యం), కుశాసన్‌ (దుష్పరిపాలన), కరప్షన్‌ (అవినీతి)’తో కూడిన ఆటవిక రాజ్యం నడిచేదన్నారు. ఇప్పుడు చొరబాటుదార్లకు మద్దతివ్వడం ద్వారా, వారి కోసం యాత్రలు చేయడం ద్వారా బిహార్‌ గుర్తింపును మటుమాయం చేయాలని, చొరబాటుదార్లను ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్‌ కూటమి చూస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ఇప్పుడున్న రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. మహాగఠ్‌బంధన్‌ మేనిఫెస్టోను అబద్ధాలపుట్టగా అభివర్ణించారు.

బిహార్‌లో హింసను సహించం: సీఈసీ

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలనూ సహించబోమని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ అన్నారు. శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బిహార్‌లో 243 మంది ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, అదే సంఖ్యలో పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల ఖర్చు పరిశీలకులు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బిహార్‌ ఎన్నికలు పారదర్శకత, సామర్థ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఉదాహరణగానే గాక మొత్తం ప్రపంచానికి ఒక నమూనాగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


  • 18న సీఎంగా ప్రమాణం చేస్తున్నా

  • బిహార్‌లో గెలుపుపై తేజస్వి ధీమా

  • నేరస్థులంతా జైల్లో ఉంటారని ప్రకటన

పట్నా, నవంబరు 2: బిహార్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి గెలుపు ఖాయమని ఆ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలుడిన నాలుగు రోజులకే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నానని చెప్పారు. మొకమా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ అరెస్టు నేపథ్యంలో తేజస్వి ఆదివారం పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈనెల 14న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. 18న ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే అంత తీవ్రమైన ఘటన జరిగింది’ అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌సురాజ్‌ పార్టీ మద్దతుదారుడైన దులార్‌ చంద్‌ యాదవ్‌ హత్యకు గురైన నేపథ్యంలో అనంత్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. ‘బిహార్‌లో ప్రతి రోజూ తీవ్రమైన నేరాలు జరుగుతున్నాయి. మహాగఠ్‌బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే పరిస్థితి మారుతుంది’ అన్నారు. కుల, మతాలకు అతీతంగా నేరస్థులందరూ జైళ్లలో ఉంటారని, వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 03 , 2025 | 04:54 AM