Varanasi Gangrape: యువతి గ్యాంప్ రేప్ పై ప్రధాని మోదీ ఆరా.. కఠిన చర్యలకు ఆదేశం
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:57 PM
వారణాసిలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇప్పటి వరకూ తొమ్మిది మందిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలి తండ్రి చెబుతున్న వివరాల ప్రకారం..

Varanasi Gangrape: వారణాసిలో జరిగిన 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారంపై ప్రధాని నరేంద్ర మోదీ కఠినమైన చర్యలకు ఆదేశించారు. మోదీ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి వచ్చిన సందర్భంలో విమానం దిగిన వెంటనే అత్యాచార ఘటనపై ఆరాతీశారు. ఘటన గురించి అధికారులు ప్రధానికి వివరించారు. నగర పోలీసు కమిషనర్, డివిజనల్ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితులపై సాధ్యమైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు.
ఇలా ఉండగా, వారణాసిలో 19 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇప్పటి వరకూ తొమ్మిది మందిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బాధితురాలి తండ్రి చెబుతున్న వివరాల ప్రకారం, "నా కుమార్తె మార్చి 29న తన స్నేహితుడ్ని కలవడానికి ఇంటి నుండి బయలుదేరింది. మూడు నాలుగు రోజులైనా ఆమె ఇంటికి రాకపోవడంతో భయపడి, ఆమె కోసం చాలా చోట్ల గాలించాం. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఏప్రిల్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఏప్రిల్ 4న ఆమెను పోలీసులు కనుగొన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స అనంతరం ఆమె సాధారణ స్థితికి చేరుకుని జరిగినదంతా వివరించింది," అని బాలిక తండ్రి చెప్పారు.
"నా కుమార్తె ఇంటర్మీడియట్‌లో కామర్స్ చదివింది. ఆమెకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆమెకు పంతొమ్మిదేళ్లు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వాళ్లెవరూ నాకు తెలీదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి వాళ్లకి బుద్ధి చెప్పడంలో దిట్ట. మాకు న్యాయం చేయాలని సీఎంను కోరుతున్నాను. నిందితుడిని ఉరితీయాలని నేను డిమాండ్ చేయను, కానీ శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి, భవిష్యత్ లో ఇలాంటి తప్పులు చేయకుండా వాళ్లకి తగిన శాస్తి చేయాలి." అన్నారు.
కాగా, నిందితుల్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. 11 మందిని బాధితురాలు గుర్తుపట్టలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, "యువతిని ప్రలోభపెట్టి తీసుకెళ్లి చాలా రోజుల పాటు అత్యాచారం చేశారు. 7 రోజుల వ్యవధిలో 23 మంది తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నాం. "ఆమెను చాలా మంది మద్యం తాగించి, సామూహిక అత్యాచారం చేశారు. చాలా మంది పాల్గొనడం అంటే అది ప్రీ ప్లాన్డ్ నేరమని అర్థమవుతోంది." అని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Tahawwur Rana-Modi: తహవూర్ రాణా అప్పగింత.. మోదీ పాత ట్వీట్ వైరల్
Custody: తహవ్వుర్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
Updated Date - Apr 11 , 2025 | 04:54 PM