PM Modi: మోదీ నివాసంలో ‘సిందూర్ మొక్క’
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:44 AM
ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా గురువారం ప్రధాని మోదీ తన అధికార నివాస ప్రాంగణంలో సిందూర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో మోదీ స్పందిస్తూ..
ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా నాటిన ప్రధాని
న్యూఢిల్లీ, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా గురువారం ప్రధాని మోదీ తన అధికార నివాస ప్రాంగణంలో సిందూర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో మోదీ స్పందిస్తూ.. దేశంలోని మహిళల స్ఫూర్తికి, పరాక్రమానికి ఈ మొక్క గుర్తుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల తాను గుజరాత్‌లోని కచ్‌కు వెళ్లినపుడు 1971 యుద్ధ సమయంలో అత్యంత ధైర్యం ప్రదర్శించిన మహిళల బృందం తనకు ఈ మొక్కను బహూకరించిందని చెప్పారు. ఢిల్లీలోని 7, లోక్‌కళ్యాణ్ మార్గ్ నివాసంలో ఆ మొక్కను నాటుతానని అప్పుడే వాళ్లకు మాట ఇచ్చానన్నారు. కాగా, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి దేశం స్వప్రయోజనాలు పక్కనబెట్టి ముందుకు రావాలని ఓ వీడియో సందేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ బ్రిడ్జి నేడు ప్రారంభం
దేశ రైల్వే చరిత్రలో శుక్రవారం నూతన ఘట్టం ఆరంభం కానుంది. జమ్మూ-కశ్మీర్‌లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ ఉక్కు వంతెన ఈఫిల్ టవర్‌ను మించిపోయింది. భూకంప ప్రభావం, వేగంగా వీచే గాలులతో ముప్పు ఉన్నప్పటికీ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని సృష్టించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. ఇందులో భాగంగానే నిర్మించిన అంజి బ్రిడ్జిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంగా శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా-శ్రీనగర్‌ల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రె్‌సకు కూడా పచ్చజెండా ఊపనున్నారు. కాట్రాలో రూ.46వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.