Share News

MP Housing Complex: ఎంపీల నివాస భవనాలకు నదుల పేర్లు

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:18 AM

భవనాలు, నివాసాలకు నదుల పేర్లు పెట్టే సంప్రదాయం.. ప్రజలను ఏకం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

MP Housing Complex: ఎంపీల నివాస భవనాలకు నదుల పేర్లు

  • ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 11: భవనాలు, నివాసాలకు నదుల పేర్లు పెట్టే సంప్రదాయం.. ప్రజలను ఏకం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు సభ్యుల కోసం ఢిల్లీలో నిర్మించిన బహుళ అంతస్తుల నివాస సముదాయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఇందులో ఉన్న నాలుగు బ్లాకులకు.. కృష్ణా, గోదావరి, హుగ్లీ, కోసీ నదుల పేర్లు పెట్టారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిపెట్టుకునే కోసీ నది పేరుపెట్టారంటూ కురుచబుద్ధి కలిగిన కొందరు విమర్శిస్తున్నారని.. నదుల పేర్లు పెట్టడం వల్ల ప్రజలు ఏకమవుతారని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. పార్లమెంటు భవనం సమీపాన బాబా ఖరక్‌సింగ్‌ మార్గ్‌లో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో ఒక్కోటీ 5 వేల చదరపు అడుగుల వైశాల్యం కలిగిన 350 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన ఎంపీలు నివసించబోతున్నారని.. ‘ఏక్‌ భారత్‌-శ్రే్‌ష్ఠ భారత్‌’ స్ఫూర్తికి నిలువుటద్దంలా నిలుస్తారని తెలిపారు. ఈ సముదాయంలో విభిన్న పండుగలు జరుపుకోవాలని.. వీటికి తమ నియోజకవర్గ ప్రజలను కూడా ఆహ్వానించవచ్చని సూచించారు. కొత్త నివాస సముదాయాన్ని పర్యావరణం, పరిశుభ్రతకు ప్రతీకగా ఎంపీలు మలచాలన్నారు. పరిశుభ్రతపై ఏటా రెండు మూడు పోటీలు నిర్వహించాల్సిందిగా పట్టణాభివృద్ధి శాఖ, రెసిడెన్షియల్‌ కమిటీలను కోరతానని చెప్పారు. దేశ రాజధానిలో ఎంపీలకు చాలా కాలంగా నివాస కొరత ఉందని ప్రధాని గుర్తుచేశారు. ముఖ్యంగా తొలిసారి గెలిచి వచ్చినవారికి వసతి దొరకడం క్లిష్టంగా మారిందన్నారు. కొత్త కాంప్లెక్స్‌ నిర్మాణంతో ఆ కష్టాలు తీరాయని చెప్పారు. 2004-14 నడుమ నాటి యూపీఏ ప్రభుత్వం ఒక్క నివాసాన్ని కూడా నిర్మించలేదని ఆక్షేపించారు. తన ప్రభుత్వం 350 ఫ్లాట్లు ఇప్పుడు నిర్మించి అందుబాటులోకి తెచ్చిందన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 04:18 AM