Sabka Saath Sabka Vikas : అందరితో.. అందరి కోసం
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:56 AM
సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ (అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం) సిద్ధాంతమే తమ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. పేదలు, మధ్యతరగతి, కొత్తగా మధ్యతరగతిలో చేరుతున్న వారి సంక్షేమం కోసం సర్కారు పని చేస్తోందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై

ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం ఇదే.. కాంగ్రెస్ హయాంలో అన్నీ బుజ్జగింపు నిర్ణయాలే
అన్ని వర్గాల సంతృప్తే మా లక్ష్యం
అంబేడ్కర్ అంటే కాంగ్రె్‌సకు గౌరవం లేదు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ (అందరితో కలిసి.. అందరి అభివృద్ధి కోసం) సిద్ధాంతమే తమ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. పేదలు, మధ్యతరగతి, కొత్తగా మధ్యతరగతిలో చేరుతున్న వారి సంక్షేమం కోసం సర్కారు పని చేస్తోందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ మోదీ గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భం గా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రె్‌సపై విమర్శలు కురిపించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆరు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పాలనలో బుజ్జగింపు విధానాలే నడిచాయి. కొందరికి మాత్రమే ఇవ్వటం.. మిగిలినవారికి నిరాకరించటం అనే విధంగా పాలన నడిచింది. 2014 తర్వాత ఈ పద్ధ తి మారింది. బుజ్జగింపు విధానాల మీద కాకుండా.. అందరి సంతృప్తే లక్ష్యంగా పాలన మొదలైంది. వనరులను సమర్థంగా ఉపయోగించుకోవటం, ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరికీ పథకాలను చేరువ చేయటంపైనే దృష్టి పెట్టాం. ఈ విధంగా ప్రతీ స్థాయిలో సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ విధానాన్ని అమలుపరిచాం. దాని ఫలితాలు ప్రస్తుతం చూస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం’ అని మోదీ తెలిపారు.
ఓబీసీ ఎంపీల డిమాండ్‌ను పట్టించుకోలేదు
ఓబీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పార్టీలకు అతీతంగా ఓబీసీ ఎంపీలు 3 దశాబ్దాలపాటు డిమాండ్ చేసినా.. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అంగీకరించలేదని ప్రధాని గుర్తు చేశారు. కానీ, తాము ఓబీసీ కమిషన్‌ను ఏరాటు చేయటమేగాక రాజ్యాంగబద్ధతను కల్పించామన్నారు. దేశంలో రిజర్వేషన్ సమస్య ఎప్పుడు ముందుకొచ్చినా సమాజంలో అశాంతికి కారణమయ్యేదని, కానీ, తాము ఎవరి కోటానూ తగ్గించకుండా ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ) వర్గాలకు 10ు రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజికవర్గాలు కూడా స్వాగతించాయని మోదీ చెప్పారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ గౌరవించలేదని, వారి పాలనలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో జైభీం అని నినదిస్తోందన్నారు.
మజ్రూ సుల్తాన్‌పురిని అరెస్టు చేయించారు
ఎమర్జెన్సీకి అనుకూలంగా మాట్లాడనందుకు బా లీవుడ్ హీరో దేవానంద్ సినిమాలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దూరదర్శన్‌లో ప్రదర్శించకుండా నిషేధించిందని, గాయకుడు కిశోర్‌కుమార్ పాటలపైనా ఇలాగే ఆంక్షలు విధించిందని మోదీ పేర్కొన్నారు. నిరసనల్లో పాల్గొన్నందుకు ప్రముఖ కవి మజ్రూ సుల్తాన్‌పురి, నటుడు బల్‌రాజ్ సాహ్నిలను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేయించిందని తెలిపారు.