Donald Trump : మనది నమ్మకమైన భాగస్వామ్యం
ABN , Publish Date - Jan 28 , 2025 | 01:32 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ‘రెండోసారి బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన ప్రియమిత్రు’నికి అభినందనలు తెలిపారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఫోన్ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం.
దానికి కట్టుబడి ఉన్నాం.. ట్రంప్‌నకు మోదీ ఫోన్
కలిసి పనిచేసేందుకు నిర్ణయం.. త్వరలో భేటీ!
అక్రమ వలసదారుల కోసం గురుద్వారాల్లో తనిఖీ
ట్రంప్ సర్కారుపై సిక్కు సంస్థల మండిపాటు
న్యూఢిల్లీ, జనవరి 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ‘రెండోసారి బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన ప్రియమిత్రు’నికి అభినందనలు తెలిపారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఫోన్ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన గత ఏడాది నవంబరు 7న కూడా ఆయనకు ఫోన్ చేశారు. దీనిపై మోదీ ట్వీట్ చేస్తూ పరస్పర ప్రయోజనాలకు, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం, ప్రపంచశాంతి, సౌభాగ్యం, భదత్ర కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాలను కేంద్రీకృతం చేసుకొని ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రతిపాదించారు. ప్రపంచ సమస్యలైన ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆసియా సమస్యలపైనా చర్చలు జరిపారు. త్వరలో భేటీ కావాలని కూడా ఇరువురు నేతలు నిర్ణయించారు. అక్రమ వలసదారుల సమస్యపై మాట్లాడిందీ లేనిదీ వెంటనే తెలియరాలేదు. ట్రంప్ అధికారం చేపట్టిన రోజున అక్రమ వలసదార్లను తిప్పిపంపించి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చాలా మంది భారతీయులు చట్టబద్ధంగానే వలస వెళ్లారు. అయితే కొందరు కెనడా, మెక్సికో సరిహద్దుల మీదుగా అక్రమ మార్గాల ద్వారా వెళ్లడంతో వారికి మాత్రం ముప్పు ఏర్పడింది. దీనిపై ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయ్‌శంకర్ మాట్లాడుతూ భారతీయులు ఎవరైనా అక్రమంగా ఉన్నారని అమెరికా భావిస్తే అలాంటి వారిని తిరిగి తీసుకువెళ్తామని చెప్పారు. సరైన పత్రాలు లేని సుమారు 18వేల మంది భారతీయులను తిప్పి పంపించే అవకాశం ఉండడంతో ఈ సమస్యను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేదానిపై ఆసక్తి నెలకొంది.