PM Modi: కాలపరీక్షను తట్టుకుని నిలిచిన స్నేహబంధం
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:00 AM
ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది. విండ్‌హోక్‌లో జరిగిన కార్యక్రమంలో ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విట్షియా మిరాబిలిస్ అవార్డును నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ప్రధాని మోదీకి బహూకరించారు.
నమీబియా పార్లమెంటులో ప్రధాని ప్రసంగం
మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం
ఇంధనం, ఆరోగ్యం తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు
విండ్‌హోక్, జూలై 9: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది. విండ్‌హోక్‌లో జరిగిన కార్యక్రమంలో ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విట్షియా మిరాబిలిస్ అవార్డును నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ప్రధాని మోదీకి బహూకరించారు. అనంతరం నెటుంబోతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఇంధనం, ఆరోగ్య రంగాలతో సహా నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ప్రధాని నమీబియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు దేశాల మధ్య స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని నిలబడిందన్నారు. భారత్‌కు చీతాలు ఇచ్చినందుకు నమీబియాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మోదీ ప్రసంగిస్తున్నంత సేపు నమీబియా పార్లమెంట్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి నమీబియా పార్లమెంట్ సభ్యులంతా లేచి నిల్చుని అభివాదం(స్టాండింగ్ ఒవేషన్) చేశారు. అంతకుముందు నమీబియా చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షురాలు నెటుంబో.. విండ్‌హోక్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కళాకారులు డప్పులు కొడుతూ, నృత్యం చేశారు. ఈ సందర్భంగా మోదీ కళాకారుల దగ్గరకు వెళ్లి వారి డప్పును కొడుతూ అక్కడి వారందరినీ ఉత్సాహపరిచారు. కాగా ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీకి అర్జెంటైనా తప్ప బ్రెజిల్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా తమ దేశ అత్యున్నత పౌరపురస్కారాలను అందజేశాయి. మోదీ ఇప్పటివరకు 17 దేశాల పార్లమెంట్‌లను ఉద్దేశించి ప్రసంగించి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ ప్రధానులంతా కలిపి 17 దేశాల పార్లమెంట్‌లను ఉద్దేశించి ప్రసంగించారు.