PM Modi Government: పీఎం కిసాన్ పక్కదారి
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:42 AM
మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం పక్కదారి పడుతోంది.
లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే కానీ.. పలు రాష్ట్రాల్లో భార్యా భర్తలిద్దరికీ అందుతున్న పీఎం కిసాన్ నిధులు
31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన ఇప్పటికి 19.02 లక్షల కేసుల పరిశీలన
17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని వెల్లడి
భూముల పూర్వపు యజమానులు కూడా.. తనిఖీల పూర్తికి రేపటి వరకు గడువు
న్యూఢిల్లీ, అక్టోబరు 13: మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం పక్కదారి పడుతోంది. ఈ స్కీంలో కొందరు అనుచిత లబ్ధి పొందుతున్నట్లు తేలింది. ఒకే ఇంట్లో భార్య, భర్త ఇద్దరికీ నిధులు జమవుతున్నాయని.. ఇలాంటి అనుమానాస్పద కేసులు 31.01 లక్షల వరకు ఉన్నట్లు కేంద్రప్రభుత్వం గుర్తించింది. కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ తనిఖీల్లో ఇది బయటపడింది. ఈ వివరాలను సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది. క్షుణ్ణంగా సోదాలు చేసి తనకు నివేదించాలని కోరింది. ఈ 31.01 లక్షల మందిలో ఇప్పటివరకు 19.02 లక్షల మంది లబ్ధిదారులను తనిఖీచేయగా.. 93.98 శాతం.. అంటే 17.87 లక్షల
మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని రుజువైంది. బుధవారం(ఈ నెల 15)లోగా తనిఖీల ప్రక్రియ పూర్తిచేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. పీఎం-కిసాన్ పథకం కింద అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్రం ఏటా రూ.6 వేల చొప్పున అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో మూడు విడతల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పథకం మార్గదర్శకాల ప్రకారం.. కుటుంబంలో భార్య గానీ, భర్త గానీ ఎవరో ఒకరు మాత్రమే ఈ సాయం పొందడానికి అర్హులు. ఒకే కుటుంబంలో మైనర్ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా లబ్ధి పొందుతున్న 1.76 లక్షల కేసులను కూడా కేంద్రం గుర్తించింది. 2019 ఫిబ్రవరి 1 తర్వాత రిజిస్టర్ చేసుకున్న రైతులు.. తమ భూములకు గత యజమానులు ఎవరో వివరాలు సమర్పించాల్సి ఉండగా.. 33.34 లక్షల మంది తప్పుడు వివరాలు ఇవ్వడమో.. ఫారంలో ఆ వివరాలను ఖాళీగా వదిలేయడమో చేశారు. పూర్వపు యజమానులు అనుచితంగా ఈ పథకం ప్రయోజనాలను పొందకుండా ఉండేందుకే ఈ నిబంధన పెట్టారు. అయినా 8.11 లక్షల మంది పూర్వపు యజమానులు, ప్రస్తుత యజమానులు.. ఉభయులూ ఆరేసి వేలు పొందుతున్నారని తేలింది. వారసత్వం ద్వారా భూములు మ్యుటేషన్ చేయించుకున్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. అయితే ఇతర మార్గాల్లో మ్యుటేషన్ చేయించుకున్న రైతులు కూడా ఈ పథకం కింద సొమ్ము తీసుకుంటున్నారు. ఇలాంటివారు 8.11 లక్షల మంది వరకు ఉన్నట్లు తాజా తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి లోపాలను నివారించేందుకు, పథకం ప్రయోజనాలను అసలైన లబ్ధిదారులకే అందించేందుకు కేంద్రప్రభుత్వం ఇటీవల పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపికకు రైతు గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది.
ఆరేళ్లు.. 20 వాయిదాలు
చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు, పెట్టుబడి సాయం కోసం వారు ప్రైవేటు వడ్డీవ్యాపారుల బారిన పడకుండా కాపాడడానికి, సాగును నిరాటంకంగా సాగించేందుకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందించడానికి మోదీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న లోక్‌సభ ఎన్నికలకు ముందు పీఎం-కిసాన్ స్కీంను ప్రారంభించింది. ఇది పూర్తిగా కేంద్ర పథకం. గుర్తించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తోంది. ఏటా మూడు వాయిదాల్లో రూ.2 వేల చొప్పున ఇస్తోంది. ఇప్పటికి 20 వాయిదాలు చెల్లించింది. దీని మొత్తం విలువ రూ.3.90 లక్షల కోట్లు. ఈ ఏడాది ఆగస్టు 2న ప్రధాని మోదీ వారాణసీ నుంచి 9.7 కోట్ల మందికి 20వ వాయిదా కింద తలో రూ.2 వేల చొప్పున జమచేశారు. 21వ వాయిదా మొత్తాన్ని మెరుపు వరదల ప్రభావిత జమ్మూకశ్మీరు రైతులకు ఈ నెల 7వ తేదీనే చెల్లించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ 8.55 లక్షల మంది ఖాతాల్లో రెండేసి వేలు జమచేశారు. దేశంలోని మిగతా రైతులకు దీపావళిలోగా జమచేసే అవకాశం ఉంది. భూమిపై హక్కులు కలిగిన చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. అధికాదాయం పొందే రైతులు, సర్వీసులో ఉన్న, రిటైరైన ప్రభుత్వాధికారులు, ఆదాయ పన్ను చెల్లింపుదారుల కుటుంబాలకు అర్హత లేదు. పీఎం కిసాన్ పోర్టల్ లేదా పీఎం కిసాన్ యాప్, చేరువలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎ్‌ససీ) ద్వారా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ పథకానికి గత ఏడాది బడ్జెట్‌లో రూ.60 వేల కోట్లు కేటాయించగా.. పెరిగిన లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకుని 2025-26 బడ్జెట్‌లో రూ.63,500 కోట్లు కేటాయించారు. మరోవైపు.. రైతుకు ఇప్పుడిస్తున్న రూ.6 వేల సాయం చాలడం లేదని.. దీనిని రూ.12 వేలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ ఇటీవల సిఫారసు చేయడం విశేషం.