Piyush Pandey: ప్రచార వ్యూహకర్త పీయూష్ పాండే కన్నుమూత
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:35 AM
పదకొండేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారానికి ‘అబ్‌కీ బార్ మోదీ సర్కార్’ నినాదాన్ని రూపొందించిన ప్రచార వ్యూహకర్త పీయూష్ పాండే శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు.
అబ్‌కీ బార్ మోదీ సర్కార్ నినాదం ఆయన సృష్టించిందే
ముంబై, అక్టోబరు 24: పదకొండేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారానికి ‘అబ్‌కీ బార్ మోదీ సర్కార్’ నినాదాన్ని రూపొందించిన ప్రచార వ్యూహకర్త పీయూష్ పాండే శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏళ్లు. 1982లో ఒగిల్వీ ఇండియా ప్రకటనల సంస్థలో చేరిన ఆయన తన ప్రకటనల్లో పాశ్చాత్య ధోరణులను పక్కనబెట్టి భారతీయ భాషల్లోని భావోద్వేగాన్ని చేర్చడం ద్వారా కొత్త ఒరవడిని సృష్టించారు. అన్ని భాషల సంస్కృతులను మేళవిస్తూ దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించిన ‘మిలే సుర్ మేరా తుమారా’ పాటను ఈయనే రాశారు. పల్స్ పోలియో ప్రచారానికి ‘దో బూంద్ జిందగీ కీ’, క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కోసం ‘కుచ్ ఖాస్ హై’, ఫెవికాల్ కోసం ‘ఫెవికాల్ కా మజ్‌బూత్ జోడ్ హై, టూటేగా నహీ’ పంచ్ లైన్లతో ఆయన రూపొందించిన ప్రకటనలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇంటింటా జనం గొంతులో పలికాయి. పీయూష్ పాండే పద్మశ్రీ గ్రహీత. రాజస్థాన్ తరఫున రంజీ క్రికెట్ ఆడారు. ఆయన సోదరి ఇలా అరుణ్ ప్రముఖ బాలీవుడ్ నటి. 2013లో మద్రాస్ కేఫ్ సినిమాలో నటించారు. పీయూష్ పాండే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన సృజనాత్మక మేథోశక్తిని గుర్తు చేసుకున్నారు.