Perplexity AI Offers to Buy Google Chrome: క్రోమ్‌ను అమ్మేయండి.. కొంటాం
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:19 AM
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ఏలుతున్న క్రోమ్ బ్రౌజర్‌ను తమకు అమ్మేయాలని గూగుల్‌కు పర్‌ప్లెక్సిటీ కృత్రిమ..
గూగుల్‌కు పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థ ఆఫర్
భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ స్థాపించిన కంపెనీ పర్‌ప్లెక్సిటీ
మూడేళ్లలోనే రూ.1.57 లక్షల కోట్లవిలువైన కంపెనీగా ఎదుగుదల
న్యూయార్క్, ఆగస్టు 13: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ఏలుతున్న క్రోమ్ బ్రౌజర్‌ను తమకు అమ్మేయాలని గూగుల్‌కు పర్‌ప్లెక్సిటీ కృత్రిమ మేధ సంస్థ ప్రతిపాదన చేసింది. భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ స్థాపించిన పర్‌ప్లెక్సిటీ విలువ సుమారు రూ.1.57 లక్షల కోట్లు (18 బిలియన్ డాలర్లు)కాగా.. క్రోమ్‌ను రూ.3 లక్షల కోట్ల (34.5 బిలియన్ డాలర్లు)కు కొంటామని ఆఫర్ చేసింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక, పెట్టుబడి సంస్థలు ఈ మేరకు తమకు నిధులు సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని పర్‌ప్లెక్సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి షెవెలెంకో వెల్లడించారు. అక్రమ పద్ధతుల్లో సెర్చింజన్ మార్కెట్‌పై గూగుల్ ఏకచ్ఛత్రాధిపత్యం సాధించిందని గతంలోనే అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టు నిర్ధారించింది. గూగుల్ సంస్థలోని సెర్చింజన్, బ్రౌజర్ ఇతర విభాగాలను వేర్వేరు కంపెనీలుగా విడదీయడంతోపాటు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తుది తీర్పు ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయుతే ఈ సమస్యకు పరిష్కారంగా క్రోమ్‌ను పూర్తిగా విక్రయించాలని గూగుల్‌కు అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పర్‌ప్లెక్సిటీ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ అంశంలో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో క్రోమ్‌ను కొనుగోలు చేస్తే.. వందల కోట్ల మందికి దగ్గరై, ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చేందుకు పర్‌ప్లెక్సిటీ సంస్థకు అవకాశం చిక్కుతుంది. కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ ఏఐని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ కూడా గతంలో క్రోమ్ కొనుగోలు దిశగా ప్రయత్నం చేశాయి.
300 కోట్ల మందికిపైగా క్రోమ్ యూజర్లు..
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్రౌజర్లలో క్రోమ్‌దే ఆధిపత్యం. మొత్తంగా 300 కోట్ల మందికిపైనే క్రోమ్‌ను వినియోగిస్తారు. ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఇది 65 శాతం. వాస్తవంగా చెప్పాలంటే చైనాలో మొత్తంగా ఆ దేశానికి చెందిన బైదు బ్రౌజర్, సెర్చింజన్‌లను వినియోగిస్తారు. అంటే చైనాను మినహాయించి చూస్తే.. ప్రపంచంలో 80 శాతం మంది వరకు క్రోమ్‌ను వాడుతున్నట్టే. ఇక ప్రపంచ సెర్చింజన్ మార్కెట్లో 90శాతాన్ని గుప్పిట పట్టిన గూగుల్ సంస్థకు ఒక రకంగా క్రోమ్ ప్రాణం లాంటిది. వినియోగదారులు సందర్శించే వెబ్‌సైట్లు, వెతికే అంశాలు, వారి ధోరణి, అవసరాలను క్రోమ్ బ్రౌజర్ ట్రాక్ చేస్తుంది. ఈ డేటా ఆధారంగానే వెబ్‌సైట్లలో గూగుల్ ప్రకటనలు (యాడ్స్), సెర్చింజన్‌లో ఫలితాలు కనిపిస్తుంటాయి. గూగుల్ ఆ ప్రకటనల ద్వారా ఏటా సుమారు రూ.26లక్షల కోట్లు (300 బిలియన్ డాలర్లు) ఆర్జిస్తుంది.
మూడేళ్లలోనే
తమిళనాడులోని చెన్నైకి చెందిన అరవింద్ శ్రీనివాస్.. 2017లో మద్రాస్ ఐఐటీలో ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. కానీ మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ (ఏఐ)పై ఇష్టంతో కంప్యూటర్ సైన్స్ కోర్సులో భాగమైన పైథాన్, ఇతర సాఫ్ట్‌వేర్లపై పట్టు సాధించారు. 2022లో మరో ముగ్గురితో కలసి పర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ప్రోగ్రామ్ సంచలనాలు సృష్టించి.. చాట్‌జీపీటీకి పోటీగా నిలిచింది. మూడేళ్లలోనే పర్‌ప్లెక్సిటీ ఏఐ కంపెనీ విలువ రూ.1.57 లక్షల కోట్ల (18 బిలియన్ డాలర్ల)కు చేరింది.