Share News

Samyama Meditation: సద్గురు ధ్యానంతో.. చలాకీ మెదడు

ABN , Publish Date - May 23 , 2025 | 04:46 AM

సద్గురు అభివృద్ధి చేసిన సంయమ సాధన ధ్యానంతో మెదడు వృద్ధాప్యం తగ్గుతుందని హార్వర్డ్‌ పరిశోధనలో వెల్లడైంది. 8 రోజుల ఈ ధ్యానంతో మెదడు వయసు 5.9 సంవత్సరాల వెనక్కి వెళ్లిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Samyama Meditation: సద్గురు ధ్యానంతో.. చలాకీ మెదడు

మస్తిష్క వృద్ధాప్యానికి మెడిటేషన్‌తో చెక్‌

సంయమ సాధనతో 5.9 ఏళ్లు వెనక్కి..

సద్గురు అభివృద్ధి చేసిన టెక్నిక్‌ సత్ఫలితాలు

హార్వర్డ్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, మే 22: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా, ధ్యానం తోడ్పడతాయని అందరికీ తెలుసు. అయితే ఓ వినూత్న ధ్యానంపై పరిశోధనల్లో సరికొత్త విషయం ఇప్పుడు గుర్తించారు. సద్గురు జగ్గీవాసుదేవ్‌ అభివృద్ధి చేసిన సంయమ సాధనతో మెదడు వృద్ధాప్యం తగ్గుతోందని హార్వర్డ్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌తో కలసి మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పటల్‌, బెత్‌ ఇస్రాయెల్‌ డీకొనెస్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు సంయమ సాధన మెడిటేషన్‌పై ఇటీవల అధ్యయనం చేశారు. ఈ ధ్యానంలో 8 రోజులు పూర్తి శిక్షణ తీసుకుని సాధన చేస్తున్న వ్యక్తులను వీరు పరిశీలించారు. సంయమ సాధన చేస్తున్న వారి ప్రస్తుత వయసు కంటే వారి మెదడు 5.9 సంవత్సరాల వెనక్కు మళ్లిందని పరిశోధనల్లో గుర్తించారు. కొంతమంది విషయంలో అది పదేళ్లకు పైగా వెనక్కి వెళ్లిందని చెప్పారు. అంటే వారి వయసుతో పోలిస్తే వారి మెదడు వృద్ధాప్యం తక్కువగా ఉందన్నారు. ఽధ్యానానికి మెదడుకు ఉన్న సంబంధాన్ని గుర్తించడానికి కొందరిపై ఈఈజీ స్కాన్లను ఉపయోగించి పరిశీలన చేశారు. ధ్యాన సాధన ఫలితాలను పోల్చి చూడటానికి ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో పూర్తి ఆరోగ్యంతో ఉన్న వారితో పాటు వయసుతో పాటు వచ్చే మెదడు సమస్యలు ఉన్న వారిని కూడా చేర్చారు. సంయమ సాధన చేసిన వారు సుఖంగా నిద్రపోతున్నారని, స్పష్టమైన ఆలోచన, పదునైన జ్ఞాపకశక్తి కలిగి ఉన్నారని వారు వెల్లడించారు. హర్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన బాల సుబ్రమణియం నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయన అంశాలను ‘మైండ్‌ఫుల్‌నెస్‌’ జర్నల్‌లో ప్రచురించారు.


ఇదొక అద్భుతం..: సద్గురు

మానవ శరీరంపై ఆధ్యాత్మిక సాధన శాస్త్రాల ప్రభావాన్ని ఆధునిక సైన్స్‌ మదించడం, గుర్తించడం అద్భుత విషయం అని సద్గురు జగ్గీవాసుదేవ్‌ పేర్కొన్నారు. ప్రతి మనిషి తన భౌతిక, మానసిక ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టాలని, అలా చేయడం వల్ల మనకు, భవిష్యత్‌ తరాలకు ఉపయోగకరమని చెప్పారు.

సంయమ సాధన అంటే ఏమిటి?

ఇది 8 రోజులు నిశ్శబ్ధంగా చేసే తీవ్రమైన సాధన. దీనికి నెలల కొద్దీ సన్నద్ధత కావాలి. సాధకులు ప్రతిరోజు యోగా, ధ్యానం సాధన కచ్చితంగా చేయాలి. వీగన్‌ డైట్‌ను అనుసరించాలి. శాంభవి మహాముద్ర, శక్తి చలన క్రియ తదితర క్రియో యోగాలను, యోగాసనాలు, శూన్య మెడిటేషన్‌ తప్పనిసరిగా చేయాలి. దీనిని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అభివృద్ధి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:46 AM