Share News

Humaira Asghar: కుళ్లిపోయిన స్థితిలో పాక్‌ నటి మృతదేహం!

ABN , Publish Date - Jul 12 , 2025 | 05:58 AM

పాకిస్థానీ నటి, 32 ఏళ్ల హుమైరా అస్గర్‌ తీవ్ర అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కరాచీలో ఒంటరిగా అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌లో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఇటీవల ఆమె మృతదేహం లభ్యమైంది.

Humaira Asghar: కుళ్లిపోయిన స్థితిలో పాక్‌ నటి మృతదేహం!

  • కరాచీలోని ఫ్లాట్‌లో 32 ఏళ్ల హుమైరా అస్గర్‌ మృతి

  • 9నెలల క్రితమే ఘటన.. చివరి ఫోన్‌కాల్‌ గత అక్టోబరులో

న్యూఢిల్లీ, జూలై 11: పాకిస్థానీ నటి, 32 ఏళ్ల హుమైరా అస్గర్‌ తీవ్ర అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కరాచీలో ఒంటరిగా అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌లో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఇటీవల ఆమె మృతదేహం లభ్యమైంది. తొలుత.. ఆమె నెలరోజుల క్రితం మృతిచెంది ఉంటారని భావించినా.. ఆమె చివరి ఫోన్‌కాల్‌, ఇతర ఆధారాలను బట్టి తొమ్మిది నెలల క్రితం అంటే 2024 అక్టోబరులో మృతిచెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె ఏడేళ్ల క్రితం లాహోర్‌ నుంచి కరాచీకి మారారు. కుటుంబసభ్యులతో సంబంధాలను తెంచుకొని ఒంటరిగా ఉంటున్నారు. యజమానికి అద్దె చెల్లించకపోవడంతో ఫ్లాట్‌ ఖాళీ చేయాలంటూ కోర్టు ఉత్తర్వును పట్టుకొని అధికారులు వచ్చి చూడగా ఈ ఘటన వెలుగుచూసింది. హుమైరా ఉంటున్న ఫ్లోర్‌లోని మరో ఫ్లాట్‌ ఫిబ్రవరి దాకా ఖాళీగా పడి ఉంది.


తాము ఆ ఫ్లాట్‌లో దిగే సమయానికి ఎలాంటి వాసనను గుర్తించలేకపోయామని అందులో ఉంటున్న వ్యక్తి విచారణ అధికారులతో చెప్పారు. నిరుడు సెప్టెంబరు, అక్టోబరులో హుమైరా చివరిసారిగా కనిపించారని, అప్పటి నుంచి ఆమెను చూడలేదని స్థానికులు చెప్పారు. అయితే ఆమె మృతికి కారణాలు తెలియలేదు. ఫోరెన్సిక్‌ బృందం వచ్చి నమూనాలను తీసుకెళ్లారు. హుమైరా తమతో రెండేళ్ల క్రితమే అన్ని సంబంధాలను తెంచుకొని వెళ్లిపోయిందని చెబుతూ ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తొలుత కుటుంబసభ్యులెవరూ ముందుకు రాలేదు. అయితే సోదరుడు నవీద్‌ అస్గర్‌ ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు. హుమైరా.. జలైబీ (2015), లవ్‌ వ్యాక్సిన్‌ (2021) అనే రెండు పాక్‌ చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్లలోనూ ఆమె ప్రధాన పాత్రలు పోషించారు.

Updated Date - Jul 12 , 2025 | 05:58 AM