Share News

Donald Trump: ట్రంప్‌కు ‘నోబెల్‌ శాంతి’!

ABN , Publish Date - Jun 22 , 2025 | 06:09 AM

నోబెల్‌ శాంతి బహుమతి-2026 కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును సిఫారసు చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని శనివారం ‘ఎక్స్‌’లో పాక్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Donald Trump: ట్రంప్‌కు ‘నోబెల్‌ శాంతి’!

  • సిఫారసు చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వ నిర్ణయం

ఇస్లామాబాద్‌, జూన్‌ 21: నోబెల్‌ శాంతి బహుమతి-2026 కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును సిఫారసు చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని శనివారం ‘ఎక్స్‌’లో పాక్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల భారత్‌-పాక్‌ ఘర్షణ సమయంలో ఆయనది ‘నిర్ణయాత్మక దౌత్య జోక్యం’ అని, క్రియాశీలక నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు అధికారికంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు వైట్‌హౌ్‌సలో ట్రంప్‌ విందు ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెరిగిపోతున్న దశలో ట్రంప్‌ గొప్ప వ్యూహాత్మక దూరదృష్టిని ప్రదర్శించారని, ఇరుదేశాలతోనూ దృఢమైన దౌత్య చర్చల ద్వారా అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించారని తాజా పోస్టులో పాక్‌ పేర్కొంది.


రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి, అంతిమంగా కాల్పుల విరమణ సాధించారని, లేకుంటే ఈ ప్రాంతంలోనూ, బయటా లక్షలాది మందిపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపేదని తెలిపింది. నిజమైన శాంతి స్థాపకుడిగా ఆయన పాత్రకు, చర్చల ద్వారా యుద్ధాన్ని పరిష్కరించడంలో ఆయన నిబద్ధతకు ఈ జోక్యం నిదర్శనమని కొనియాడింది. జమ్మూకశ్మీర్‌ అంశం పరిష్కారానికీ సహాయం చేస్తానని ట్రంప్‌ నిజయతీగా ప్రకటించారని పేర్కొంది. ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వం దిశగా ప్రత్యేకించి గాజాలో కొనసాగుతున్న మానవతా విషాదం, ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు సహా పశ్చిమాసియాలో సంక్షోభాల పరిష్కారానికి ఆయన ప్రయత్నాలు కొనసాగుతాయని పాక్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, భారత్‌-పాక్‌ యుద్ధాన్ని ‘ఆపినందుకు’, రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నందుకు తనకు నోబెల్‌ బహుమతి రాదని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 22 , 2025 | 06:09 AM