Share News

Terrorist House Demolition: కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద ఏరివేత చర్యలు.. మరో టెర్రరిస్టు ఇల్లు పేల్చివేత

ABN , Publish Date - Apr 27 , 2025 | 07:54 AM

జమ్మూకశ్మీర్‌లో వివిధ ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. కొన్ని చోట్ల బుల్డోజర్లతో కూల్చివేసి మరికొన్ని చోట్ల ఐఈడీలతో పేల్చి వేస్తున్నాయి.

Terrorist House Demolition: కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద ఏరివేత చర్యలు.. మరో టెర్రరిస్టు ఇల్లు పేల్చివేత
Terrorist House Demolition

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి తరువాత భారత భద్రతా దళాలు జమ్మూకశ్మీర్‌‌లో పెద్ద ఎత్తున ఉగ్రవాద ఏరివేత చర్యలకు పూనుకున్నాయి. వివిధ జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా షోపియన్ జిల్లాలోని లష్కరే ఉగ్రవాది అద్నన్ షాఫీకి చెందిన ఇంటిని భద్రతా దళాలు పేల్చి వేశాయి. అంతకు కొన్ని గంటలకు ముందే కుప్వారాలోని ఫరూఖ్ అహ్మద్ అనే మరో లష్కర్ ఉగ్రవాది ఇంటిని బాంబులతో నేలమట్టం చేశాయి.

ఇతర టెర్రరిస్టులకు సంబంధించిన స్థిరాస్తులను కూడా భద్రతా దళాలు ఒక్కొక్కటిగా టార్గెట్ చేస్తున్నాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న అదిల్ అహ్మద్ థోకర్‌కు అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఇంటిని, పుల్వామాలో అహ్సన్ ఉల్ హక్ షేఖ్, త్రాల్‌లోని ఆసిఫ్ అహ్మద్ షేఖ్ ఇంటిని, షోపియ్ జిల్లాలోని షాహిద్ అహ్మద్ కుట్టే ఇంటిని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.


శుక్రవారం నాడు పహల్గాం ఉగ్రవాదులవిగా భావిస్తున్న ఇళ్లను కూడా పేల్చి వేశాయి. బిజ్‌బహారాలోని అదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిని ఐఈడీలతో పేల్చి వేయగా, ఆసిఫ్ షేక్ ఇంటికి బుల్‌డోజర్‌లతో కూల్చి వేశాయి.

పహల్గాం మారణహోమానికి పాల్పడ్డ పాకిస్థానీ టెర్రరిస్టులకు అదిల్ థోకర్ సాయం అందించాడని పోలీసులు తెలిపారు. 2018లో పాక్‌కు వెళ్లిన అదిల్ అక్కడి ఉగ్రవాద క్యాంపుల్లో శిక్షణ పొందాడు. గతేడాది గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ కాశ్మీర్‌లోకి ప్రవేశించాడు.

ఇదిలా ఉంటే.. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల జాడ చెప్పిన వారికి రూ.20 లక్షల నజరానాను పోలీసులు ప్రకటించారు. ఈ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల రేఖా చిత్రాలను కూడా విడుదల చేశారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ దారుణంలో ఉగ్రవాదులు బైసరన్ వ్యాలీ చుట్టు ఉన్న అడవుల్లోంచి ఒక్కసారిగా బయటకొచ్చి నిరాయుధులైన టూరిస్టులను బలి తీసుకున్నారు. ఏకే-47లతో కాల్చి చంపేశారు. దీంతో, పాక్, భారత్‌ల మధ్య తీవ్ర ఉద్రికతలు మొదలయ్యాయి. యుద్ధ భయాలు కూడా నెలకొన్నాయి.


ఇవి కూడా చదవండి..

అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు

అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య

పహల్గాం దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Read Latest and International News

Updated Date - Apr 27 , 2025 | 10:40 AM