Share News

Pahalgam Attack: నేడు పార్లమెంటులో హోరాహోరీ!

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:28 AM

పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై సోమవారం పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం ప్రారంభం కానున్నది.

Pahalgam Attack: నేడు పార్లమెంటులో హోరాహోరీ!

  • పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై చర్చ

  • పలు ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై సోమవారం పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం ప్రారంభం కానున్నది. ఈ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ సర్కారు వారిని ఎలా ఎదుర్కొంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వరుసగా 5 రోజుల పాటు స్థంభింపచేసిన ప్రతిపక్షాలు.. ఈ అంశాలపై ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించిన తర్వాతే శాంతించాయి.


సోమవారం లోక్‌సభలో 16 గంటల పాటు చర్చ నిర్వహించాలని, అది ముగిసిన వెంటనే రాజ్యసభలోనూ 16 గంటల పాటు చర్చించాలని శుక్రవారం పార్లమెంటరీవ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఇండి కూటమి నేతలు సమావేశమై చర్చను ఎలా ఎక్కుపెట్టాలో వ్యూహరచన చేయనున్నారు. ప్రధానంగా జాతీయ భద్రత, విదేశీ విధానం అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయని కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. కాగా, సోమవారం నుంచి బుధవారం వరకు లోక్‌సభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్‌ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది.

Updated Date - Jul 28 , 2025 | 05:28 AM