Share News

Aggressive Attack on Modi Govt: ఓట్ల సవరణకు తోడైన ఓట్ల చోరీ

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:09 AM

మోదీ సర్కారుపై పార్లమెంట్‌లో మరింత దూకుడుగా వ్యవహరించాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.

Aggressive Attack on Modi Govt: ఓట్ల సవరణకు తోడైన ఓట్ల చోరీ

  • మోదీ సర్కారుపై ముప్పేటదాడికి విపక్షాలు సిద్ధం

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మోదీ సర్కారుపై పార్లమెంట్‌లో మరింత దూకుడుగా వ్యవహరించాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. బిహార్‌లోని సమగ్ర ఓట్ల సవరణ అంశంతోపాటు ఓట్ల చోరీ అంశాన్ని కూడా బలంగా వినిపించాలని విపక్షాలు భావిస్తున్నాయి. దీంతోపాటు బీజేపీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్‌ చేసే ప్రయత్నాలపై కూడా సభలో చర్చించాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ పనితీరుపై సభలో ఎప్పుడూ చర్చ జరగలేదంటూ తప్పించుకోవడానికి వీలులేదని, ఈసీ పనితీరుపై పార్లమెంట్‌ లో చర్చ జరిగిన సందర్భాలున్నాయని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాకూర్‌ శనివారం మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో ధనబలాన్ని నియంత్రించేందుకు చట్టాలు చేయాల్సిన అవసరం, బిహార్‌, త్రిపురలో ఎన్నికలు వాయిదా పడడం, ఫొటో ఐడీ కార్డు, 1993లో ఎన్నికలను వాయిదా వేయాలనే సీఈసీ నిర్ణయం, ఎన్‌ఆర్‌ఐలకు ప్రాక్సీ ఓటింగ్‌ వంటి అనేక అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం బిహార్‌లో యుద్ధ ప్రాతిపదికపై ఓట్ల సవరణ చేపట్టడంపై ఎందుకు చర్చించరని నిలదీశారు. ఒక పక్క విపక్షాలు సోమవారం సభను స్తంభింపజేసే అవకాశాలున్నప్పటికీ కొన్ని అంశాలపై చర్చకు వారు అంగీకరించవచ్చని సమాచారం. జాతీయ క్రీడా బిల్లును సంయు క్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలంటూ డిమాండ్‌ చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో భారత్‌పై అమెరికా ఏకపక్షంగా టారిఫ్‌ లను విధించడం, ప్రభుత్వ విదేశాంగ విధానం విఫలం కావడంపై కూడా ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు ఉభయ సభల్ని సాగనిచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - Aug 11 , 2025 | 03:09 AM