New Delhi : అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చెయ్యాల్సిందే!
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:36 AM
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్ణకరమని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలు పేర్కొన్నాయి.

కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ పార్టీల డిమాండ్
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటపై విచారం
కుంభమేళాకు అర్థం పర్థం ఉందా ? : లాలూ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్ణకరమని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలు పేర్కొన్నాయి. తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనతో రైల్వేశాఖ వైఫల్యం మరోసారి బయట పడిందన్నారు. అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయకుంటే కేంద్రమే ఆయనపై వేటు వెయ్యాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనథే డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటన రైల్వే శాఖ మూకుమ్మడి వైఫల్యానికి నిదర్శనమని ఆప్ ఆరోపించింది. మహా కుంభమేళాకు బయలుదేరిన ప్రయాణికులు తొక్కిసలాటలో చనిపోవడం బాధాకరమని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. కాగా, తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్.. అసలు మహా కుంభమేళాకు అర్థం పర్థం ఏమైనా ఉందా ?(కుంభ్ కా కోయి మతలబ్ హై.. ఫాల్తూ హై కుంభ్) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాపై లాలూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. లాలూ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించాయి. మరోపక్క, తొక్కిసలాట ఘటనను కప్పిపుచ్చేందుకు కేంద్రం ప్రయత్నించిందని టీఎంసీ ఆరోపించింది. తొక్కిసలాటలో 18 మంది మరణించారనే వార్త తన హృదయాన్ని కలచివేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ పేర్కొన్నారు. మహా కుంభమేళా వంటి కార్యక్రమాల కోసం మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.