Karnataka: ధర్మస్థల వివాదం వెనుక సీఎం ప్రమేయం
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:04 AM
ధర్మస్థలలో సాగుతున్న వివాదం వెనుక కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని.., హిందూ మతం, ఆలయాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు కమ్యూనిస్టు భావాలు కలిగిన అర్బన్ నక్సల్స్‌కు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ప్రతిపక్షనేత అశోక తీవ్రంగా ఆరోపించారు.
ప్రతిపక్షనేత అశోక ఆరోపణ
బెంగళూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ధర్మస్థలలో సాగుతున్న వివాదం వెనుక కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని.., హిందూ మతం, ఆలయాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు కమ్యూనిస్టు భావాలు కలిగిన అర్బన్ నక్సల్స్‌కు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ప్రతిపక్షనేత అశోక తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం హుబ్బళ్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సౌజన్య, సిట్ కేసులను ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. ఎవరో ఒక వ్యక్తి మాటలు విని ముఖ్యమంత్రి సిట్ దర్యాప్తునకు ఆదేశించడం సరికాదని పేర్కొన్నారు. కొందరు ధర్మసల ఆలయానికి ఎక్స్‌కవేటర్‌తో దూసుకొస్తామని హెచ్చరిస్తున్నారని, అడవిలో మతోన్మాదులు, నక్సల్స్‌కు ఎర్ర తివాచీ పరిచి జనజీవనంలోకి తీసుకొచ్చిన సిద్దరామయ్య వీటన్నింటికీ కారణమని ఆరోపించారు.
వివాదం వెనుక కుట్ర ఉందని డీసీఎం డీకే శివకుమార్ ఆరోపించారని, ఈ విషయమై ముఖ్యమంత్రి నోరు విప్పడం లేదని, కాంగ్రె్‌సలోనే హిందూ వ్యతిరేక, హిందూ అనుకూల గ్రూపులు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, ముస్లింలీగ్‌తోపాటు పలు హిందూ వ్యతిరేక సంఘాలతో సంబంధాలు పెట్టుకున్న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆలయాలను మూసివేసే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ఆరోపించారు. హుబ్బళ్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరో ఒక అనామకుడు విన్నవించాడని ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పా టు చేసిందన్నారు. ధర్మస్థళ ధర్మాధికారి వీరేంద్రహెగ్డే పట్ల నోటికొచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.