Ooty Hill Train: 117వ వసంతంలోకి ఊటీ కొండరైలు...
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:57 AM
పచ్చటి ప్రకృతి, రమణీయమైన కొండల సోయగాల నడుమ నడిచే నీలగిరి జిల్లా ఊటీ కొండ రైలు బుధవారం 117వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా ఊటీ రైల్వేస్టేషన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు జరపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
చెన్నై: పచ్చటి ప్రకృతి, రమణీయమైన కొండల సోయగాల నడుమ నడిచే నీలగిరి జిల్లా ఊటీ కొండ రైలు(Ooty Hill Train) బుధవారం 117వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా ఊటీ రైల్వేస్టేషన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు జరపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. నిజానికి కొండ రైలును 120 సంవత్సరాల క్రితం మేట్టుపాళయం-కున్నూర్ మధ్య ప్రారంభించారు. తొమ్మిది సంవత్సరాల అనంతరం కున్నూర్ నుంచి ఊటీ సమీపంలోని ఫెర్న్‌హిల్ అనే ప్రాంతం వరకు విస్తరించారు.

అనంతరం 1909 అక్టోబరు 15న ఊటీలో రైల్వేస్టేషన్ ఏర్పాటుచేసి, కొండ రైలును ఊటీ వరకు పొడిగించారు. ఈ రైలు ఆసియా ఖండంలో అతి పొడవైన మీటర్ గేజ్ కొండ రైలుగా పేరొందింది. ప్రస్తుతం కున్నూర్‌లోని వర్క్‌షాప్ దక్షిణ రైల్వేలో ఉన్న ఏకైక ఆవిరి లోకోమోటివ్ వర్క్‌షా్‌పగా నిలిచింది. ఈ వర్క్ షాప్ 1899లో ప్రారంభించారు. మేట్టుపాళయం-కున్నూర్ మధ్య నడిపే ఆవిరి లోకోమోటివ్‌ను స్విట్టర్లాండ్ నుంచి దిగుమతి చేసుకుని, ఈ వర్క్ షాప్‌లో పర్యవేక్షిస్తున్నారు.
ఆసియాలోనే ఏటవాలు రైల్వే లైన్...
మేట్టుపాళయం-కున్నూర్ మధ్య రైల్వే లెన్ ఆసియాలోనే అత్యంత ఏటవాలుగా ఉంటుంది. ఈ కారణంగా, రైలును కాగ్ వీల్ సహాయంతో నడుపుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వందేళ్ల్లుగా సేవలందించిన ఆవిరి లోకోమోటివ్‌కు విశ్రాంతి కల్పించి, ఊటీ-కున్నూర్ మధ్య డీజిల్ లోకోమోటివ్ ప్రారంభించారు. 11,516 మీటర్ల పొడవు, 2.15 మీటర్ల వెడల్పుతో కూడిన 4 బోగీల కొండ రైలు నడుపుతున్నారు.

మేట్టుపాళయం- ఊటీ (46 కి.మీ) మధ్య 208 మలుపులు, 250 వంతెనలు, 16 సొరంగాల గుండా కొండ రైలు వెళ్తుంది. రైల్వే శాఖ, నీలగిరి హెరిటేజ్ రైల్వే ఫ్రిజర్వేషన్ సొసైటీ నీలగిరి కొండ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించాలని కోరాయి. 2005 జూలై 15న డర్బన్‌లో జరిగిన 29వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ ప్రకారం, నీలగిరి కొండ రైలును యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఫలితంగా, రైల్వేస్టేషన్, కొండ రైలు ప్రపంచ పర్యాటక పటంలో స్థానం పొందాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News