Power Generation : వెదురుతోనూ విద్యుత్తు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:53 AM
స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భాగంగా దేశంలోనే తొలిసారి ‘జాతీయ థర్మల్ విద్యుత్తు సంస్థ (ఎన్‌టీపీసీ)’ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గుతో పాటు వెదురును కూడా కలిపి మండించనుంది.

షోలాపూర్ ఎన్టీపీసీ ఽథర్మల్ కేంద్రంలో బొగ్గుతో కలిపి మండించాలని నిర్ణయం
దేశంలోనే తొలిసారి బయోమాస్ ఆధారిత విద్యుదుత్పత్తి
వెదురు సాగును ప్రోత్సహించేందుకు రైతులకు రాయితీలు
ముంబై, జనవరి 6: స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో భాగంగా దేశంలోనే తొలిసారి ‘జాతీయ థర్మల్ విద్యుత్తు సంస్థ (ఎన్‌టీపీసీ)’ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుదుత్పత్తి కోసం బొగ్గుతో పాటు వెదురును కూడా కలిపి మండించనుంది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఉన్న థర్మల్ విద్యుత్కేంద్రంలో తొలిసారిగా ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే తొలిసారి షోలాపూర్‌లోని సూపర్ థర్మల్ విద్యుత్కేంద్రంలో ‘బయోమాస్ (వెదురు)’ ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎన్టీపీసీకి లేఖ రాశారు. థర్మల్ విద్యుత్కేంద్రానికి అవసరమైన వెదురును షోలాపూర్, సమీప ప్రాంతాల్లోని రైతుల నుంచి కొనుగోలు చేస్తామని సీఎం టాస్క్‌ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాషా పటేల్ చెప్పారు. ప్రస్తుతం షోలాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి కోసం ఏటా 40 లక్షల టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారని.. ఒక కిలో బొగ్గును మండిస్తే 2.08 కిలోల కార్బన్ విడుదల అవుతుందని, అంటే ఏటా ఏ స్థాయిలో కార్బన్ ఉత్పత్తి అవుతుందో ఊహించుకోవచ్చని పటేల్ అన్నారు. చాలా దేశాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లను మూసివేస్తున్నారని గుర్తుచేశారు. ఈ విషయంలో మన దేశంలోనూ కొంత పురోగతి ఉందన్నారు. షోలాపూర్ ఎన్టీపీసీలో బయోమా్‌సగా వెదురును వినియోగించాలని నిర్ణయించామని, ఇందుకోసం వెదురు సాగును భారీగా పెంచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. వెదురు సాగు చేసే రైతులకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 50 ఏళ్ల పాటు వెదురు కొనేలా ఒప్పందం చేసుకునేందుకు ఎన్టీపీసీ అంగీకరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారని, పెద్ద ఎత్తున వెదురు సాగుకు ముందుకొస్తున్నారని చెప్పారు. లక్ష హెక్టార్లలో వెదురు సాగు చేయాలని ఎన్టీపీసీ పిలుపునిచ్చిందన్నారు.