Supreme Court: ధర్మస్థల కవరేజీపై మీడియాకు అడ్డుకట్ట వేయలేం
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:30 AM
కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాలు పూడ్చిపెట్టిన వివాదంపై మీడియా కవరేజీపై ఆంక్షలు
చాలా అరుదైన కేసుల్లోనే ‘గ్యాగ్ ఆర్డర్’
సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ, 15వ ప్రదేశంలో తనిఖీలు ప్రారంభం
బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని ధర్మస్థలలో మృతదేహాలు పూడ్చిపెట్టిన వివాదంపై మీడియా కవరేజీపై ఆంక్షలు విధించలేమని, అడ్డుకట్ట వేయలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తేల్చిచెప్పింది. అయితే ఆలయాన్ని నిర్వహిస్తున్న తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రచారంలో ఉన్న అవమానకర కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ధర్మస్థల ఆలయ ట్రస్టు కార్యదర్శి హర్షేంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై కొత్త నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్ (నిషేధ ఉత్తర్వులు) ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. మీ వద్ద ఉన్న సమాచారాన్ని ట్రయల్ కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌కు సూచించింది. ధర్మస్థల ఆలయ ట్రస్టు సభ్యులుగా ఉన్న తమ కుటుంబాన్ని అవమానించేలా సాగుతున్న మీడియా ప్రచారం నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. యూట్యూబ్ చానెళ్లలో 8 వేలకు పైగా లింక్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, శవాల పూడ్చివేత కేసుపై రిపోర్టింగ్‌ను నియంత్రిస్తూ బెంగళూరు సివిల్ కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 1న పక్కన పెట్టింది.
భద్రత కల్పించండి.. ఫిర్యాదుదారుడి వినతి
తనకు ప్రాణభయం ఉందని, గన్‌మెన్‌తోపాటు భద్రత కల్పించాలని ధర్మస్థలలో వందలాది మృతదేహాలను పూడ్చానని ఫిర్యాదు చేసిన మాజీ పారిశుధ్య కార్మికుడు ‘సిట్’ అధికారులను శుక్రవారం కోరారు. ఇప్పటికే ఆయనకు భద్రత కల్పించామని, మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు హామీ ఇచ్చారు. మరోవైపు ఫిర్యాదుదారుడు చూపిన 14 స్థలాల్లో 13 చోట్ల తవ్వకాలు ముగిశాయి. 13వ స్థలంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)తో తనిఖీలు చేపట్టాలని భావిస్తున్నారు. జీపీఆర్ వినియోగానికి అవసరమైన అనుమతుల కోసం సిట్ ఎదురుచూస్తోంది. శుక్రవారం 15వ ప్రదేశాన్ని చూపగా.. అక్కడ తనిఖీలు ప్రారంభించారు. మృతదేహాలు పూడ్చి పెట్టానని ఫిర్యాదు చేసిన వ్యక్తితో కలిసి గతంలో 1995 నుంచి 2014 వరకు పనిచేసిన తమిళనాడుకు చెందిన ఐదుగురిని సిట్ అధికారులు రప్పించి, విచారించింది. ధర్మస్థల గ్రామపంచాయతీ నుంచి పాత రికార్డులను పరిశీలించారు. కాగా, బెళ్తంగడిలో సిట్ కార్యాలయాన్ని సిట్ పోలీ్‌సస్టేషన్‌గా మార్పు చేశారు.
గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు: బీఎల్ సంతోష్
మృతదేహాలను పూడ్చిపెట్టారన్న ఆరోపణలు ధర్మస్థల పేరును చెడగొట్టే ప్రయత్నంలో భాగమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. గతంలో శబరిమల, శనిసింగనాపూర్, ఈషా ఫౌండేషన్‌పై ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయని శుక్రవారం పేర్కొన్నారు. ధర్మస్థల దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతోందని, దశాబ్దాలుగా ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొస్తున్న సంస్థ అని, విద్య, వసతి కల్పిస్తోందని తెలిపారు. మహిళల చైతన్యం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎప్పుడో జరిగిందనే అంశాన్ని తెరపైకి తెచ్చి వివాదం చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.