Income tax : వచ్చే వారమే కొత్త ఆదాయపన్ను బిల్లు!
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:49 AM
కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారమే పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం.. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ కొత్త బిల్లు న్యాయ స్ఫూర్తికి
‘న్యాయ’ స్ఫూర్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారమే పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం.. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ కొత్త బిల్లు న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా ఉంటుందన్నారు. బడ్జెట్ ప్రసంగంలో కూడా.. భారతీయ దండ సంహిత స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకువచ్చామని పేర్కొన్న నేపథ్యంలో కొత్త ఆదాయ పన్ను చట్టంలో భారీ మార్పులు చేసినట్టు తెలిపారు. ‘ముందు విశ్వసించు- తర్వాత పరిశీలించు’ అనే విధానంతో ఈ బిల్లును ముందుకు తీసువెళ్తామని పేర్కొన్నారు. 1961 నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో దీనిని తీసుకువస్తున్నామన్నారు. ‘‘కొత్త బిల్లును చాలా సరళతరం చేశాం. ప్రస్తుత చట్టంతో పోల్చుకుంటే అధ్యాయాలు, పదాలు వంటివాటిని సగానికిపైగా తగ్గించాం. కొత్త బిల్లును అర్థం చేసుకోవడం చాలా తేలిక. పైగా వివాదాలు, వ్యాజ్యాలు కూడా తగ్గుముఖం పడతాయి’’ అని మంత్రి తెలిపారు. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. తాజాగా కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారమే సభలో ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. ‘‘ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నా. ఈ బిల్లును స్థాయీ సంఘానికి కూడా పంపనున్నాం’’ అని నిర్మలా సీతారామన్ వివరించారు. కాగా, ఈ కొత్త బిల్లుపై 6,500 మంది స్టేక్ హోల్డర్‌ల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించారు.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News