Malayalam Actor Rini George : నా పోరాటం మహిళల కోసమే: మలయాళ నటి రిని జార్జ్
ABN , Publish Date - Aug 21 , 2025 | 07:02 PM
నా పోరాటం ఏ వ్యక్తిపైనా కాదు, నా పోరాటం మహిళల కోసమే అని కేరళ సినీ నటి రిని ఆన్ జార్జ్ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది సేపటికి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
పాలక్కాడ్ (కేరళ), ఆగస్టు 21 : నా పోరాటం ఏ వ్యక్తిపైనా కాదు, నా పోరాటం మహిళల కోసమే అని కేరళ టీవీ జర్నలిస్ట్, సినీ నటి రిని ఆన్ జార్జ్ చెప్పారు. పాలక్కాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ మమ్‌కూటథిల్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది సేపటికి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 'నా పోరాటం మహిళల కోసమే, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదు. మహిళలు ముందుకు వచ్చినప్పుడు, సమాజం దాని వెనుక ఉన్న సత్యాన్ని గుర్తించి అర్థం చేసుకోవాలి. మొదట్లో, నేను మాట్లాడినప్పుడు, నన్ను కొంతమంది అవమానించారు. కానీ తరువాత చాలా మంది ఇతరులు కూడా ఫిర్యాదులతో ముందుకు రావడం ప్రారంభించారు.' అని రిని చెప్పారు.
'ఇది ఏ రాజకీయ పార్టీచే స్పాన్సర్ చేయబడలేదని కుండబద్దలు కొట్టిన రిని తన ఆరోపణల వెనక ఎలాంటి కుట్ర, ఇతరుల ప్రోద్భలం లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. 'నేను ఏ వ్యక్తిని లేదా సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి ఇక్కడ లేను. ఎందుకంటే నా పోరాటం వ్యక్తిగతమైనది కాదు. ఇది సమాజంలోని తప్పుడు ధోరణులకు వ్యతిరేకంగా. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనే దాని గురించి నా ఆందోళన. ఇది ఒక వ్యక్తి గురించి కాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినందుకు నేను ఎంతో బాధ పడ్డాను.' అని జార్జ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
రిని జార్జ్ తన ప్రకటనలో ఇంకా ఏమన్నారంటే.. 'రాజీనామాలు వంటివి నైతిక ప్రాతిపదికన ఉండాలి. ఆ వ్యక్తిలో స్వతహాగా మంచి మార్పులు రావాలి. నేను ఇప్పటికీ అతన్ని మంచి స్నేహితుడిగా భావిస్తున్నాను. కానీ సమాజానికి మంచి చేయడానికి రాజకీయ నాయకులు అవసరం. దానిని వారు గుర్తుంచుకుని మెలగాలి. సన్మార్గంలో మెలగాలి' అని ఆమె అన్నారు.