హ్యాట్సాప్ పోలీస్ సార్.. మీ మంచి మనసుకు జోహార్లు
ABN , Publish Date - Apr 10 , 2025 | 10:41 AM
ఖాకీలంటే.. కరుడుకట్టిన మనుషులు మాత్రమే కాదు.. వారిలో కూడా మానవత్వం ఉంటుంది. సాయం కోరిన వెంటనే స్పందించి మంచి మనసు చాటుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిపోయిన ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలించి.. వారి ప్రాణాలు కాపాడాడు ఓ పోలీసు అధికారి. ఆ వివరాలు..

ముంబై: పోలీసులంటే మన సమాజంలో చాలా మందికి నేటికి కూడా సరైన అభిప్రాయం లేదు. ఖాకీలను చూస్తేనే భయంతో పక్కకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను అమలు చేస్తున్నప్పటకీ చాలా వరకు జనాల్లో వారిపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాలు తొలగిపోలేదు. ఇక వృత్తిపరంగా పోలీసులు కఠినంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి.. కాస్త కఠినంగా కనపడతారు. కానీ మనకు ఎదైనా సమస్య వస్తే.. అందరి కన్నా ముందు వచ్చి.. దాన్ని పరిష్కరిస్తారు. చాలా మంది పోలీసులు అవసరమైన సమయంలో తమలోని మానవత్వాన్ని చాటుకుని.. ప్రజలకు సాయం చేసిన ఘటనలు కోకొల్లలు.
తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ప్రమాదంలో గాయపడి నడిరోడ్డు మీద పడిపోయి.. సాయం కోసం ఎదురు చూస్తున్న క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. వారి పాలిట దేవుడిగా నిలిచాడు ఓ పోలీసు అధికారి. ఈ విషయం తెలిసి జనాలు ఆ అధికారిని రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
ప్రకాశ్ బాగల్ అనే వ్యక్తి.. ముంబై ఎకనామిక్ అఫెన్సీవ్ వింగ్‌లో సీనియర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అనగా ఏప్రిల్ 5 ఉదయం 8.30 గంటలకు విధి నిర్వహణ నిమిత్తం ఇంటి నుంచి బయలదేరాడు. ప్రభుత్వ వాహనంలో కంజుమార్గ్ దారిలో వెళ్తుండగా.. రోడ్డు మీద గాయాలతో, రక్తం కారుతూ సాయం కోసం ఎదురు చూస్తోన్న ఇద్దరు యువకులను చూశాడు. బాధితులు సర్వీస్ రోడ్డు, హైవేకి మధ్యలో పడి ఉన్నారు.
వారిన చూసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకున్న బాగల్.. డ్రైవర్ సాయంతో ఇద్దరు క్షతగాత్రులను సమీపంలోని గోడ్రేజ్ ఆస్పత్రికి తరలించారు. ఆఫీసర్ వెంటనే స్పందించడం వలన ఇద్దరు బాధితులకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు బాగల్‌ని ప్రశంసించారు. అతడు చేసిన సాయం గురించి తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్ కాస్త వైరల్ కావడంతో.. నెటిజనులు బాగల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు నిజంగా రియల్ హీరో సార్.. మీ వల్ల రెండు కుటుంబాల్లో సంతోషం నిండిది.. వారి తల్లిదండ్రులకు కడుపుకోత తప్పింది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Pawan Kalyan Son: కోలుకుంటున్న మార్క్ శంకర్
Medical Exam Malpractice: ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్