Share News

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌.. మేడిన్‌ ఇండియా విజయం

ABN , Publish Date - May 26 , 2025 | 02:28 AM

ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని ప్రధాని మోదీ భారత్‌ దేశీయ రక్షణ సామర్థ్యాల ప్రతీకగా పేర్కొన్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో అభివృద్ధి, యోగా ప్రచారం, మహిళల శక్తీప్రదానం వంటి అంశాలపై ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన దృష్టి సారించారు.

PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌.. మేడిన్‌ ఇండియా విజయం

ఉగ్ర పోరులో కీలక మలుపు.. ఇది కేవలం సైనిక చర్య కాదు భారత్‌ పరివర్తనకు నిదర్శనం: ప్రధాని

న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్‌ సిందూర్‌’ టెర్రరిజంపై పోరులో కీలక మలుపుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘మేడిన్‌ ఇండియా’ ఆయుధాలు, వ్యవస్థలు దీని విజయంలో కీలక భూమిక నిర్వహించాయన్నారు. ‘ఇవాళ దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైంది. భారత్‌ అసలు బలం ఇదే. ఈ సందర్భంగా దేశవాసులందరినీ ఒకటి కోరుతున్నాను. అవకాశం ఉన్న చోట.. మన జీవనావసరాలకు దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులను మాత్రమే వాడదామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’ అని పిలుపిచ్చారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం 122వ సంచికలో పాకిస్థాన్‌, దాని ప్రేరిత ఉగ్రవాదులపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి వివరించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు, నేతలు ఢిల్లీలో మూకుమ్మడిగా ఈ కార్యక్రమం విన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ మాట్లాడారు. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)ల్లో భారత సైన్యం నాశనం చేసిన ఉగ్రవాద స్థావరాల ఫొటోలను ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు. ప్రధానంగా పీవోకేలో ధ్వంసమైన గుల్పూర్‌, అబ్బాస్‌, బర్నాలా క్యాంపుల గురించి ప్రస్తావించారు. జమ్మూకశ్మీరులోని రాజౌరీ, పూంచ్‌లలో కార్యకలాపాలు నిర్వహించే లష్కరే తయ్యబా టెర్రరిస్టులకు గుల్పూర్‌ శిబిరం ప్రధాన స్థావరం. అబ్బాస్‌... లష్కరే ఆత్మాహుతి బాంబర్ల శిక్షణకు సంబంధించిన కీలక కేంద్రం.


ఆయుధ శిక్షణ, ఐఈడీల తయారీని బర్నాలాలో నేర్పుతారు. ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు కచ్చితత్వంతో దాడియడం అసాధారణమని మోదీ అన్నారు. ‘మన ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరి శ్రమకూ ఈ విజయం చిహ్నం. ఆపరేషన్‌సిందూర్‌ యావజ్జాతిలో దేశభక్తి భావన చొప్పించింది’ అని చెప్పారు. ‘ఆపరేషన్‌ విజయవంతానికి.. ఆత్మనిర్భర భారత్‌ స్ఫూర్తితో దేశీయంగా పెరిగిన రక్షణ సామర్థ్యం ప్రధాన కారణం. దేశీయంగా రూపుదిద్దుకున్న ఆయుధాలు, టెక్నాలజీ శక్తికి మన సైనికుల శౌర్యం తోడయింది. ఆపరేషన్‌ సిందూర్‌.. స్థానికత కోసం గళమెత్తేందుకు (వోకల్‌ ఫర్‌ లోకల్‌’) సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇది దేశభక్తిని ఇనుమడింపజేయడమే గాక.. స్వావలంబన స్ఫూర్తిని కూడా బలోపేతం చేసింది. మనందరం ఒక్క అడుగు ముందుకేస్తే భారత పురోగతికి పెద్దఎత్తున తోడ్పడుతుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ ఉద్యమంలో భాగంగా చాలా మంది భారతీయులు.. తమ సెలవు దినాలను దేశీయంగానే గడపాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. పలువురు యువత భారత్‌లోనే పెళ్లి చేసుకుంటామని అంటున్నారన్నారు. టర్కీ నగరం ఇస్తాంబుల్‌ నగరం అంతర్జాతీయంగా పెళ్లిళ్లకు పెట్టింది పేరు. అయితే, ఆ దేశం ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌కు మద్దతివ్వడంతో టర్కీని బాయ్‌కాట్‌ చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది ఈ నేపథ్యంలో మోదీ విదేశాల్లో పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించడం విశేషం.


మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో అభివృద్ధి

మావోయిజంపై సమైక్య పోరాటం ఫలితాలిస్తోందని ప్రధాని చెప్పారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో అభివృద్ధి, విద్య ముందంజలో ఉన్నాయని తెలిపారు. ‘మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కతేజ్‌వారీ వంటి మారుమూల ప్రాంతాలు, ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ ప్రాంతంలో విద్య, బస్సు సర్వీసుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ క్లాస్‌ 10 పరీక్షల్లో 95 శాతం ఫలితాలతో దంతెవాడ జిల్లా అగ్ర స్థానంలో నిలువగా.. క్లాస్‌ 12 ఫలితాల్లో ఆరో ర్యాంకు లభించిందని చెప్పారు.. బస్తర్‌ ఒలింపిక్స్‌, సైన్స్‌ లేబొరేటరీల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.


‘యోగాంధ్ర’, సంగారెడ్డి మహిళలు భేష్‌

యోగా మన జీవన విధానాన్ని మారుస్తుందని.. ప్రజలంతా దానిని అనుసరించాలని ప్రధాని పిలుపిచ్చారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 10 లక్షల మంది యోగా ప్రాక్టీషనర్స్‌ను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘యోగాంధ్ర’ అభియాన్‌కు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగా సంస్కృతిని అభివృద్థి చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఆ రోజు తాను విశాఖ వెళ్తున్నానని, అక్కడ జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించిందని తెలిపారు. విశాఖపట్నం, గురుగ్రామ్‌ వంటి నగరాల్లో కొన్ని స్టార్ట్‌పలు పేపర్‌ రీసైక్లింగ్‌లో వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు మార్పు సాధ్యమేనని తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు నిరూపిస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి వరకు ఇతరులపై ఆధారపడ్డ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్లను ఆపరేట్‌ చేస్తూ 50 ఎకరాల భూమిలో మందులను పిచికారీ చేస్తున్నారని అన్నారు. వారు ’డ్రోన్‌ ఆపరేటర్లు’గా కాదు.. ’స్కై వారియర్స్‌’గా గుర్తింపు పొందారని కితాబిచ్చారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు పని చేస్తూ మహిళలు మందుల పిచికారీ పని పూర్తి చేస్తున్నారని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:58 AM