PM Modi: చొరబాటుదారులంటే వారికి అభిమానం
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:45 AM
విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్, ఆర్‌జేడీ అమిత అభిమానం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు.
కాంగ్రెస్, ఆర్‌జేడీలపై మోదీ ఫైర్
ఆర్‌జేడీకి మద్దతివ్వడం రాహుల్‌కు ఇష్టం లేదని వ్యాఖ్య
భాగల్పూర్/అరారియా, నవంబరు 6: విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్, ఆర్‌జేడీ అమిత అభిమానం చూపుతున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం శ్రీరాముడిని, ఛఠ్ మాతను అసహ్యించుకుంటున్నాయని విమర్శించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భాగల్పూర్, అరారియా జిల్లాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. అయోధ్యలో రామాలయంతో పాటు నిషాదరాజ్ (గుహుడు), శబరి మాత, వాల్మీకి మహర్షి కోసం నిర్మించిన ఆలయాలను సందర్శించడానికీ ప్రతిపక్ష నేతలు విముఖత చూపుతున్నారని.. దళితులు, వెనుకబడిన తరగతులంటే వారికున్న ద్వేషానికి ఇదే రుజువని చెప్పారు. ఆర్‌జేడీ, కాంగ్రెస్ మధ్య అంతర్యుద్ధం నడుస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు దేశంలోనే అత్యంత అవినీతి కుటుంబం, బిహార్లోని అత్యంత అవినీతి కుటుంబం సారథ్యం వహిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ‘నామ్‌దార్’ (రాహుల్‌గాంధీ) కొద్దిరోజులుగా ప్రచారంలో కనిపించడం లేదని.. ఆర్జేడీకి మద్దతివ్వడం ఆయనకు ఇష్టమే లేదని, బలవంతంగా వస్తున్నారని తెలిపారు. 15 ఏళ్ల ఆర్‌జేడీ ఆటవిక పాలనలో రాష్ట్రంలో అభివృద్ధే లేదని.. సీఎం నితీశ్ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ నుంచి బయటకు తెచ్చేందుకు ఎంతో కష్టపడిందని చెప్పారు.
ఆర్మీ జవాన్ల కులం అడుగుతారా?: అమిత్ షా
బెతియా/మోతిహారి/మధుబని: ఆర్మీ జవాన్ల కులం, మతం గురించి అడుగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. అందుకు సిగ్గుపడాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మండిపడ్డారు. గురువారం బిహార్లోని మధుబని, పశ్చిమ చంపారన్, మోతిహారి జిల్లాల్లో వరుస సభల్లో ఆయన పాల్గొన్నారు. కులం, వర్గాల ఆధారంగా సైనిక సిబ్బందిపై వివక్ష చూపడం తగదన్నారు.
బిహార్లో ఓట్ల చోరీకి బీజేపీ యత్నాల: రాహుల్
పూర్ణియా: బీజేపీ పూర్తి శక్తియుక్తులతో బిహార్లో ఓట్ల చోరీకి ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనిని అడ్డుకునే బాధ్యత యువతపైనే ఉందని చెప్పారు. గురువారం పూర్ణియా, అరారియాల్లో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. ఓట్ల దొంగతనంతో ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందని ఆరోపించారు. ‘హరియాణా ఎన్నికలను బీజేపీ, ఎన్నికల కమిషన్ తస్కరించాయని యావత్ ప్రపంచానికి మేం చూపించాం. బిహార్లో యువత కూడా అప్రమత్తంగా ఉండాలి’ అని ఆయన అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా కూడా సీతామఢీ, తూర్పు చంపారన్ జిల్లాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక హక్కులను బలహీనపరిచేందుకు ఈసీ మోదీ ప్రభుత్వంతో కుమ్మక్కైందని ఆరోపించారు.