Adani Controversy: అదానీ అంశం వ్యక్తిగతం
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:49 AM
అదానీ కేసు విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించారా అని ప్రశ్నించగా, రెండు దేశాల అధినేతలు కలుసుకున్నప్పుడు వ్యక్తిగత అంశాలు చర్చకు రావని మోదీ సమాధానమిచ్చారు.

ట్రంప్‌తో చర్చించే విషయం కాదది: మోదీ
మోదీ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన రాహుల్
అమెరికాలోనూ అదానీని రక్షిస్తున్నారని ఫైర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన అవినీతి కేసు గురించి భారత్ ప్రధాని నరేంద్రమోదీని అక్కడ మీడియా ప్రశ్నించింది. అదానీ కేసు విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించారా అని ప్రశ్నించగా, రెండు దేశాల అధినేతలు కలుసుకున్నప్పుడు వ్యక్తిగత అంశాలు చర్చకు రావని మోదీ సమాధానమిచ్చారు. ‘‘భారతదేశం ప్రజాస్వామ్యదేశం. విశ్వాన్నంతా కుటుంబంగా భావించే వసుదైక కుటుంబం అనే భావనే మా సంస్కృతికి, తాత్వికతకు, ఆలోచనలకు మూలం. ప్రతి భారతీయుడూ నా కుటుంబసభ్యుడే. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే, రెండు దేశాలకు చెందిన ఇద్దరు నాయకులు వ్యక్తిగత అంశాలపై చర్చించేందుకు కలుసుకోరు’’ అని మోదీ వివరించారు. మోదీ సమాధానం హిందీలో ఉండటంతో వ్యక్తిగత్ అనే మాటను వైట్‌హౌస్ అనువాదకుడు వ్యక్తిగతం అంటూ అనువదించారు. అయితే, హిందీలో ఈ మాటకు ప్రైవేటు, అంతర్గతం అనే అర్థాలు కూడా ఉన్నాయి. అంతకుముందు..ఇదే ప్రశ్న ట్రంప్‌ను అడగ్గా, ఆయన స్పందించలేదు. కాగా, మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దేశంలోనే కాకుండా, అమెరికాలోనూ అదానీని మోదీ రక్షిస్తున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శించారు.
‘‘ఇక్కడ అడిగితే మోదీ మౌనంగా ఉంటారు. అక్కడ అడిగితే వ్యక్తిగత విషయం అంటూ దాటవేస్తున్నారు’’ అని ‘ఎక్స్’లో హిందీలో రాహుల్ ట్విట్ చేశారు. అదానీ అనే మాట వినగానే మోదీ ముఖం మాడిపోయిందని, పొంతన లేని విషయాలేవో మాట్లాడారని కాంగ్రె్‌సకు చెందిన మరో నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. మరోవైపు, భాషతో సంబంధం లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని పార్లమెంటులో బలంగా ముందుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రాహుల్ సూచించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటులో హిందీ లేక ఇంగ్లి్‌షలో మాట్లాడాలనే పట్టింపు అక్కర్లేదని, బాగా తెలిసిన భాషలోనే చర్చల్లో పాల్గొనవచ్చునని రాహుల్ సూచించారు. వచ్చే నెల 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రతి సభ్యుడూ పాల్గొనాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.