PM Modi: శాంతిని నెలకొల్పాలి: మోదీ
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:41 AM
ప్రధాని మోదీకి ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు పేజేష్కియాన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 22: ప్రధాని మోదీకి ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు పేజేష్కియాన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాలు దౌత్య మార్గాలు, చర్చల ద్వారా పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పి, భద్రత, సుస్థిరతను స్థాపించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఇరాన్‌పై అమెరికా దాడిపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే విస్ఫోటనం అంచున ఉన్న ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచడం వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు, అమెరికా దాడుల నేపథ్యంలో ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ వద్ద ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రాసీ ప్రకటించారు. ఇరాన్‌పై అమెరికా దాడిని పాకిస్థాన్ కూడా ఖండించింది. తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని స్పష్టం చేసింది.