Parliament Session: వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:09 AM
వచ్చేవారం మొదలవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినవి కాగా..
పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మోదీ సర్కారు.. భౌగోళిక వారసత్వ ప్రదేశాల పరిరక్షణ, క్రీడలు సహా 8 కొత్త బిల్లులు
జస్టిస్ వర్మపైన అభిశంసన తీర్మానం కూడా
21 నుంచి ఆగస్టు 21దాకా సమావేశాలు
న్యూఢిల్లీ, జూలై 16: వచ్చేవారం మొదలవుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినవి కాగా.. సుపరిపాలన ద్వారా క్రీడల్లో నైతిక ఆచరణలు, భౌగోళిక వారసత్వ ప్రదేశాలు, అవశేషాల పరిరక్షణ బిల్లు సహా 8 బిల్లులు కొత్తగా రానున్నాయని లోక్‌సభ సచివాలయం అంతర్గత బులెటిన్‌లో పేర్కొంది. ఆదాయ పన్ను సవరణ బిల్లు, ప్రస్తుత సాంకేతిక శకానికి వర్తించని పురాతన నిబంధనల తొలగింపునకు జన విశ్వాస్ సవరణ బిల్లు(2025), వివిధ క్రీడాసంస్థల్లో జవాబుదారీతనం కోసం జాతీయ క్రీడల పరిపాలన బిల్లు(2025), 1908నాటి భారతీయ రేవుల చట్టం స్థానంలో నూతన బిల్లు (2025), మర్చెంట్ షిప్పింగ్ బిల్లు (2024), ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ నియమాళికి అనుగుణంగా జాతీయ డోపింగ్ వ్యతిరేక సవరణ బిల్లు(2025), గనులు, ఖనిజాల అభివృద్ధి, క్రమబద్ధీకరణ బిల్లు (2025), ట్యాక్సేషన్ చట్టాల సవరణ బిల్లు(2025), గోవా అసెంబ్లీలో ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించే బిల్లు, సముద్రమార్గాన వస్తు రవాణా బిల్లు (2024), గువాహటి ఐఐఎంను చట్టంలో చేర్చేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సవరణ బిల్లులను ఉభయసభల్లో చర్చించి ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మను అభిశంసించే తీర్మానం కూడా పార్లమెంటు ముందుకు రానుంది. ఈ నెల 21న ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21న సమావేశాలు ముగుస్తాయి.
పహల్గాంపై సర్కారుతో కాంగ్రెస్ ఢీ
పహల్గాంలో ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితాల సవరణ వ్యవహారాలపై పార్లమెంటులో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపడేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ పార్లమెంటు వ్యూహ కమిటీ గత మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉభయసభల్లో ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, ఖర్గే, రాజ్యసభలో ఉపనేత ప్రమోద్ తివారీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ భేటీలో పాల్గొన్నారు. పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదో జవాబు చెప్పాలని.. ఆపరేషన్ సిందూర్ వివరాలు సమగ్రంగా తెలియజేయాలని తాము డిమాండ్ చేయనున్నట్లు తివారీ ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు.