India on Path to Become Top3 Economy: టాప్3 దిశగా భారత్
ABN , Publish Date - Aug 11 , 2025 | 03:05 AM
భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన విమర్శలకు ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలో టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని కౌంటర్ ఇచ్చారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే స్ఫూర్తి నుంచి ఈ వేగం వచ్చిందన్నారు. స్పష్టమైన ఉద్దేశం, నిజాయితీ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతి
ట్రంప్‌కు మోదీ పరోక్ష కౌంటర్
ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక భారత్ సాంకేతికత, మేకిన్ ఇండియా
ప్రపంచంతో పోటీపడడమే కాదు.. నాయకత్వం కూడా వహించాలి: మోదీ
బెంగళూరు మెట్రో ఫేజ్-3కు శంకుస్థాపన.. ఎల్లో లైన్ సేవలు షురూ
3 వందేభారత్ రైళ్లు జాతికి అంకితం
మెట్రోలో విద్యార్థులతో మోదీ ముచ్చట
బెంగళూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన విమర్శలకు ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. ప్రపంచంలో టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని కౌంటర్ ఇచ్చారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే స్ఫూర్తి నుంచి ఈ వేగం వచ్చిందన్నారు. స్పష్టమైన ఉద్దేశం, నిజాయితీ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఆదివారం బెంగళూరులో మెట్రో ఫేజ్-3 పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక భారత సాంకేతిక పరిజ్ఞానం, మేక్ ఇన్ ఇండియా శక్తి దాగున్నాయని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్‌ను చూసిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ పోటీ పడటమే గాక నాయకత్వం కూడా వహించాలని ఆకాంక్షించారు. మన నగరాలు స్మార్ట్‌గా, వేగంగా, సమర్థంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందుతామని అన్నారు. 21వ శతాబ్దంలో నగర ప్రాజెక్టులు, నగరాల మౌలిక సదుపాయాలు అత్యంత అవసరమని అన్నారు. 11 ఏళ్ల క్రితం ఆర్థిక పరంగా దేశం పదోస్థానంలో ఉండేదని, ప్రస్తుతం నాలుగో స్థానానికి ఎదిగిందని అన్నారు.
ఈ మూడు రంగాల్లో వేగంగా వృద్ధి
2014 నాటికి మన దేశంలో ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైల్వే సేవలు పరిమితంగా ఉండేవని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు 24 నగరాల్లో 1000 కిలో మీటర్లకు పైగా మెట్రో నెట్‌వర్క్ విస్తరించిందని చెప్పారు. ‘‘2014కు ముందు దేశంలో దాదాపు 20,000 కి.మీ. రైలు మార్గాన్ని విద్యుద్దీకరించారు. గత 11 సంవత్సరాల్లో ఎన్డీయే ప్రభుత్వంలో 40,000 కి.మీ.కు పైగా రైలు మార్గాన్ని విద్యుద్దీకరించాం. 2014 నాటికి దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 160కు పైగా పెరిగింది. జలమార్గాలను కూడా ఇదే రీతిలో అభివృద్ధి చేశాం. 2014 నాటికి కేవలం 3 జాతీయ జలమార్గాలు పనిచేస్తుండగా, ఇప్పుడు ఈ సంఖ్య 30కి పెరిగింది’’ అని మోదీ వివరించారు.
3 వందే భారత్ రైళ్లు ప్రారంభం
ఒకరోజు బెంగళూరు పర్యటనలో భాగంగా మూడు వందేభారత్ రైళ్లతో పాటు ఎల్లోలైన్ మెట్రో సేవలను మోదీ జాతికి అంకితం చేశారు. బెంగళూరు నుంచి బెళగావి నగరానికి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికగా అమృత్‌సర్ నుంచి మాతా వైష్ణోదేవికత్రాకు, నాగ్‌పూర్ నుంచి పుణెకు వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. బెంగళూరు నగరానికి తలమానికంగా ప్రధానంగా ఐటీ కంపెనీలు, పారిశ్రామికవాడలకు అనుబంధమైన ఆర్‌వీరోడ్డు-బొమ్మసంద్ర మధ్య ఎల్లోలైన్ మెట్రో సేవలను ప్రధాని ప్రారంభించారు. ఎలకా్ట్రనిక్ సిటీలో మెట్రో ఫేజ్-3 జేపీనగర్ 4వ స్టేజ్ నుంచి కనకపుర అవుటర్ రింగ్ రోడ్డు దాకా, మాగడి రోడ్డు హొసహళ్లి నుంచి కడబగెరె దాకా 44.65 కిలోమీటర్ల మెట్రో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
మెట్రోకు 87% రాష్ట్ర నిధులే: సిద్దరామయ్య
మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 87.37ు ఖర్చు చేస్తుండగా కేంద్రం వాటా 12.63ు మాత్రమేనని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. ఎలకా్ట్రనిక్ సిటీలో జరిగిన సమావేశంలో ప్రధాని సమక్షంలోనే మఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా పెరుగుతోందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో ఖర్చు చేయాల్సి ఉందని, 12 శాతం మాత్రమే కేంద్రం భరిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. 2014కు ముందు కర్ణాటకకు రైల్వే బడ్జెట్‌లో రూ.835 కోట్లు మాత్రమే కేటాయించారని, మోదీ ప్రధాని అయ్యాక ప్రస్తుతం 7500 కోట్లకు పెంచారని తెలిపారు. మరోవైపు, వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు ప్రగతికి ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని మోదీని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారు. బెంగళూరులో నీటి సరఫరా, చెత్త సేకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.1.5 లక్షల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లించే రాష్ట్రాల్లో కర్ణాటక రెండో స్థానంలో ఉందని, కేంద్ర ఖజానాకు సుమారు 4.5 లక్షల కోట్లు సమకూరుస్తోందని వివరించారు.
ఎల్లరిగూ నమస్కార: మోదీ
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా బెంగళూరుకు వచ్చానని మోదీ అన్నారు. కన్నడిగులను ఆకట్టుకునేలా కన్నడ భాషలో ‘ఎల్లరిగూ నమస్కార’ (అందరికీ నమస్కారం) అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్‌లో బెంగళూరు, ఇక్కడి యువత కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశంలో ఐటీ, రక్షణ రంగాల్లో స్వావలంబన సాధించడంలో బెంగళూరు పాత్ర కీలకమని కొనియాడారు. ప్రపంచ ఐటీ రంగంలో బెంగళూరుది ప్రత్యేక స్థానమని అన్నారు. ప్రస్తుతం బెంగళూరు దేశంలో అతి పెద్ద మెట్రో సంచారం గల రెండో నగరమని అన్నారు. ప్రధాని మోదీ నగరంలోని జయనగర్ రాగిగుడ్డ స్టేషన్ నుంచి ఎలకా్ట్రనిక్ సిటీ దాకా మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కార్మికులు, మెట్రో అధికారులతో ముచ్చటించారు.