PM Modi: ఉగ్రవాదంపై పోరు.. మన బాధ్యత
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:40 AM
ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని మానవత్వం పట్ల మన బాధ్యతగా అభివర్ణించారు.
మానవత్వంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్క దేశానికీ పహల్గాం ఉగ్రదాడి బహిరంగ సవాల్ వంటిది: ఎస్‌సీవోలో ప్రధాని మోదీ
తియాన్జిన్, సెప్టెంబరు 1: ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని మానవత్వం పట్ల మన బాధ్యతగా అభివర్ణించారు. చైనాలోని తియాన్జిన్‌లో జరిగిన ఎస్‌సీవో వార్షిక సదస్సులో.. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితర దేశాధినేతల సమక్షంలో ప్రసంగించిన ఆయన.. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అది కేవలం భారత్‌పై జరిగిన దాడి మాత్రమే కాదని.. మానవత్వంపై నమ్మకం ఉన్న ప్రతి దేశానికీ అది ఒక బహిరంగ సవాల్ వంటిదని ఆయన పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం.. ఆ విషాద సమయంలో భారతదేశానికి అండగా నిలిచిన అన్ని స్నేహపూర్వక దేశాలకూ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం కొన్ని దేశాల భద్రతకు మాత్రమే పొంచి ఉన్న ముప్పు కాదని.. మొత్తం మానవాళికే అది ఉమ్మడి సవాల్ అని వ్యాఖ్యానించారు. ‘‘కానీ కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు పలుకుతున్నాయి. ఇది మనకు అంగీకారయోగ్యమేనా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఏ దేశమూ, ఏ సమాజమూ, ఏ ఒక్క పౌరుడూ ఉగ్రవాదం నుంచి తాము సురక్షితంగా ఉన్నామని భావించలేని పరిస్థితి. అందుకే ఉగ్రవాదంపై పోరాటంలో ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ పదేపదే నొక్కిచెబుతోంది’’ అని స్పష్టంచేశారు. ‘‘ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనే విషయాన్ని మనం స్పష్టంగా, ముక్తకంఠంతో చెప్పాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని ఉమ్మడిగా వ్యతిరేకించాలి. ఇది మానవత్వం పట్ల మన కర్తవ్యం’’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా.. ‘ఎస్‌సీవో’కు మోదీ తనదైన భాష్యం చెప్పారు. ఎస్ అంటే సెక్యూరిటీ (భద్రత), సీ అంటే కనెక్టివిటీ (అనుసంధానం), ఓ అంటే ఆపర్చునిటీ (అవకాశం) అనే మూడు పిల్లర్లపై ఎస్‌సీవో నిలిచి ఉందని ఆయన పేర్కొన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వం పునాదుల వంటివని.. ఆ వృద్ధిపథంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ప్రధాన సవాళ్లుగా నిలుస్తాయని అన్నారు.
చైనాకు చురకలు..
ప్రాంతీయ వృద్ధి, అభివృద్ధికి అనుసంధానం (కనెక్టివిటీ) ఎంత ముఖ్యమైనదో కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలిపారు. అయితే.. ఆ అనుసంధానం కోసం చేసే ప్రతి ప్రయత్నం సార్వభౌమత్వ సూత్రాలను, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని.. ఎస్‌సీవో చార్టర్‌లోని ప్రధాన సూత్రాల్లో దీన్ని కూడా పొందుపరచారని గుర్తుచేశారు. సార్వభౌమత్వాన్ని పట్టించుకోని అనుసంధానం చివరికి నమ్మకాన్ని, అర్థాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. తద్వారా చైనా తలపెట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ను పరోక్షంగా విమర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే ఈ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఎస్‌సీవో సభ్య దేశాల ప్రాచీన నాగరికతల, కళల, సాహిత్య సంపదను, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై పంచుకునేలా ఒక చర్చా వేదికను ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. గ్లోబల్ సౌత్ (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల) అభివృద్ధి సాధనకు కృషి చేయడం ఎంత ముఖ్యమో పేర్కొన్నారు. ఆయా దేశాల ఆకాంక్షలను కాలంచెల్లిన పాత విధానాలు, పాత నియమాల చట్రంలో బంధించి ఉంచడమంటే.. భవిష్యత్ తరాలకు అన్యాయం చేయడమేనని ఆందోళన వెలిబుచ్చారు.