Mithilanchal Emerges: మిథిలాంచల్ సవాల్
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:25 AM
బిహార్ ఎన్నికల్లో ‘మిథిలాంచల్’ ప్రాంతం అటు పాలక ఎన్‌డీఏకి, ఇటు ప్రతిపక్ష ‘మహాగఠ్‌బంధన్’కు, ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్‌సురాజ్ పార్టీకి కీలకంగా మారింది.
7 జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాలు
గత ఎన్నికల్లో 26 చోట్ల గెలిచిన ఎన్‌డీఏ
7 చోట్ల బరిలోకి దిగిన ఎంఐఎం
పట్నా, నవంబరు 5: బిహార్ ఎన్నికల్లో ‘మిథిలాంచల్’ ప్రాంతం అటు పాలక ఎన్‌డీఏకి, ఇటు ప్రతిపక్ష ‘మహాగఠ్‌బంధన్’కు, ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్‌సురాజ్ పార్టీకి కీలకంగా మారింది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో ఏడు జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఐదేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం దీని అభివృద్ధిపై దృష్టి సారించింది. మధుబని కళకు ప్రాచుర్యం కల్పించింది. మఖానా పంటకు మిథిలాంచల్ పేరొందడంతో మద్దతు ధర పెంచింది. ఏకంగా మఖానా బోర్డునే ఏర్పాటుచేసింది. 2020 ఎన్నికల్లో ఇక్కడున్న 40 స్థానాలకు గాను ఎన్‌డీఏ 26 చోట్ల గెలిచింది. ఇందులో బీజేపీ వాటా 18 సీట్లు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈప్రాంతంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ ఎన్‌డీఏనే గెలుచుకుంది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. జన్‌సురాజ్ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కూడా బరిలో దిగడంతో రాజకీయ వేడి పెరిగింది. 2020 ఎన్నికల్లో ముస్లిం జనాభా ఉన్న సీమాంచల్‌లో ఎంఐఎం ఏకంగా ఐదు చోట్ల గెలిచింది. మొత్తంగా కనీసం 16 చోట్ల ఆర్‌జేడీ, జేడీయూ విజయావకాశాలను దెబ్బతీసింది. దీనివల్ల మహాగఠ్‌బంధన్ అధికారానికి అడు గు దూరాన ఉండిపోయింది. మిథిలాంచల్‌లో మైథిలి బ్రాహ్మణులు, యాదవులు, మత్స్యకారులు సహా అత్యంత వెనుకబడిన కులాలు(ఈబీసీ), దళితులు, ముస్లింలు కీల క సామాజిక వర్గాలు. ముస్లింలు దర్భంగా జిల్లాలో 22ు, మధుబని జిల్లాలో 18.25ు చొప్పున ఉన్నారు. ఈ వర్గం ఓట్లను సంఘటితం చేసి తన వైపు తిప్పుకోవాలని ఒవైసీ కొద్దినెలలుగా తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నా జనతా పార్టీలతో జట్టుకట్టి గ్రాండ్ డెమోక్రాటిక్ అలయెన్స్ (జీడీఏ)ను ఏర్పాటుచేశారు. ఎంఐఎం మిథిలాంచల్‌లో ఏడు చోట్ల పోటీచేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి.. బీజేపీని గెలిపించేందుకే ఒవైసీ అభ్యర్థులను నిలిపారని ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఆరోపిస్తు న్నాయి.. దీనిని ఒవైసీ తోసిపుచ్చారు. ప్రజలకు మూడో ప్రత్యామ్నాయం అవసరమని స్పష్టంచేశారు.
- సెంట్రల్ డెస్క్.