Air India: కేంద్ర మంత్రికి విమానంలో విరిగిన సీటు
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:18 AM
తాను ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సమయంలో తనకు విరిగిన, కిందకు దిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భోపాల్/ముంబై, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): విమానయాన సంస్థ ఎయిరిండియాపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ మండిపడ్డారు. తాను ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన సమయంలో తనకు విరిగిన, కిందకు దిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అనైతికమని, ప్రయాణికుల నుంచి పూర్తి చార్జీ వసూలు చేసే సంస్థ.. వారికి విరిగిపోయిన సీట్లు కేటాయించడం మోసగించడమేనంటూ తనకు ఎదురైన అనుభవాన్ని శనివారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన సీటే కాకుండా విమానంలోని మరికొన్ని సీట్లు కూడా ఇదేవిధంగా ఉన్నాయని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. తోటి ప్రయాణికులు తమ సీటులో కూర్చోమని ఆఫర్ చేశారని, అయితే వారికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో తాను ఆ విరిగిన సీటులోనే ప్రయాణం చేశానని తెలిపారు. దీనిపై ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఎయిరిండియా విమాన సంస్థను ఆదేశించింది.